1 మిలియ‌న్ ల‌క్ష్యం ఛేదించిన వైసీపీ!

ఏపీ అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం నెర‌వేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మంటూ.. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ సిద్ధం పేరిట ఎన్నిక‌ల స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి విశాఖ‌, ఏలూరుల్లో సిద్ధం స‌భ‌లు నిర్వ‌హించిన వైసీపీ అధినేత‌.. తాజాగా అనంత‌పురంలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో మూడో సిద్ధం స‌భ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఈ స‌భ‌కు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు. ఏకంగా మూడో ద‌ఫా సిద్ధం స‌భ‌కు 1 మిలియ‌న్‌.. అంటే ప‌ది ల‌క్ష‌ల పైచిలుకు.. జ‌నాభాను తీసుకురావాల‌ని పార్టీ నేత‌ల‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.

దీంతో రాప్తాడు స‌భ‌లో ఈ ల‌క్ష్యం నెర‌వేరిందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎటు చూసినా.. వైసీపీ జెండాలే మెరిశాయి. ఎటు చూసినా.. ప్ర‌జ‌లు జ‌య జ‌య ధ్వానాలే మిన్నంటాయి. ఏదారి చూసినా వైసీపీ స‌భ‌కే దారి తీస్తోందా.. అన్న‌ట్టుగా.. పెద్ద పిన్నా.. అంద‌రూ వైసీపీ సిద్ధం స‌భ వైపే అడుగులు వేశారు. వైసీపీ పార్టీ ప‌రంగా కొంత మేర‌కు బ‌స్సులు పెట్టినా.. అవి కూడా .. స‌రిపోక‌.. చాలా మంది స్వ‌చ్ఛందంగా స‌భ‌కు త‌ర‌లివ‌చ్చారు. మ‌రికొంద‌రు.. కాలిబాట‌న వ‌చ్చి చేరుకున్నారు. మొత్తంగా.. పార్టీ వ్యూహం.. అంచ‌నా.. ల‌క్ష్యం.. ఇలా ఒకదానితో ఒక‌టి క‌లిసి వ‌చ్చి.. ఫ‌లించాయి.

ఫ‌లితంగా.. వైసీపీ అదినేత పెట్టుకున్న 10 లక్ష‌ల మంది ల‌క్ష్యాన్ని పార్టీ ఛేదించింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. సుమారు 10 నుంచి 12ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఈ సిద్ధం మూడో స‌భ‌కు హాజ‌ర‌య్యార‌ని అంటున్నారు., కొంద‌రు.. స‌భా ప్రాంగంలో సీట్లు ల‌భించ‌క‌.. రోడ్ల‌పైనే నిల‌బ‌డి.. సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని విన్నారు. మ‌రికొంద‌రు.. స‌భ‌లో నిల‌బ‌డి.. ఇంకొంద‌రు.. త‌మ త‌మ వాహ‌నాల్లోనే కూర్చుని సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని తిలకించారు. చాలా మంది .. స‌భా ప్రాంగణం కిక్కిరిసిపోయినా.. ఓపిక‌గా నిల‌బ‌డి సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని ఆసాంతం ఆల‌కించారు. దీంతో వైసీపీ నాయ‌కుల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది.

గ‌త రెండు సిద్ధం స‌భ‌ల‌కు.. మించి..అన్న‌ట్టుగా రాప్తాడు స‌భను క్షేత్ర‌స్థాయిలో పార్టీ నాయ‌కులు బ్ర‌హ్మాండంగా విజ‌యవంతం చేశార‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. ఇక‌, గ‌తంలో తొలి సిద్ధం స‌భ‌కు 5 ల‌క్ష‌ల మందిని టార్గెట్‌గా పెట్టుకోగా.. 6 నుంచి 7 ల‌క్ష‌ల మంది వ‌చ్చార‌ని అంచ‌నా ఉంది. ఇక‌, ఏలూరు జిల్లాలో నిర్వ‌హించిన రెండో సిద్ధం స‌భ‌కు కూడా.. ఇంచుమించు ఇంత‌క‌న్నా ఎక్కువ‌మందే హాజ‌ర‌య్యారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా 10 ల‌క్ష‌ల మంది పైగానే ప్ర‌జ‌లు హాజ‌రైన‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు సీఎం జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌, ఆయ‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థంగా వారు పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం.