రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్‌

వైసీపీ పాల‌న‌లో గ‌త ఐదేళ్లుగా ప్ర‌జ‌లు న‌ర‌కం చ‌విచూస్తున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క‌ష్టాలు..క‌న్నీటిని చూసి.. చంద్ర‌బాబు చ‌లించిపోయార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో త‌యార‌వుతోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికే గ‌త ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను కూడా మేనిఫెస్టోలో చేర్చ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట‌లో నిర్వ‌హించిన శంఖారావం స‌భ‌లో నారా లోకేష్ మాట్లాడారు. “చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో అనేక మంది క‌న్నీళ్లు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ క‌న్నీళ్లు తుడ‌వాల‌ని.. పేద‌ల జీవితాల్లో భ‌రోసా నింపాల‌ని ఆయ‌న అనుకున్నారు. అందుకే మేనిఫెస్టోను పేద ప్ర‌జ‌ల సెంట్రిక్‌గా త‌యారు చేస్తున్నారు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక‌, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని లోకేష్ విమ‌ర్శించారు. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చామన్నారే త‌ప్ప అధికారాలు ఇవ్వ‌లేద‌న్నారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని నిల‌దీశారు. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే ఎమ్మెల్యేల‌ను ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నార‌ని.. అయినా.. పార్టీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించారు. రెడ్డి నాయ‌కులు కాకుండా.. కేవ‌లం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయ‌కులనే మారుస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అంబ‌టి రాయుడిని సీఎం జ‌గ‌న్ అవ‌మానించార‌ని నారా లోకేష్‌ తెలిపారు. ఆయ‌న వైసీపీలోకి వ‌స్తే.. ఎంపీ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు గుంజాల‌ని చూశార‌ని.. ఆరోపించారు. అంత సొమ్ము ఇచ్చుకుని ఓడిపోవ‌డం ఇష్టం లేక‌.. అంబ‌టి రాయుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. రెడ్‌ బుక్‌ చూసి జగన్‌ వణికిపోతున్నారని, ఆయన కటింగ్‌.. ఫిటింగ్‌ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.