రెండుసీట్ల కోసం మూడుపార్టీలు పట్టు

మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఫైనల్ కాలేదు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ, జనసేన మధ్యలోకి బీజేపీ సడన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అప్పటివరకు టీడీపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు చర్చలంతా పక్కకుపోయాయి. ఇపుడు విషయం ఏమిటంటే మూడు పార్టీలు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం కోసం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో రాజంపేట, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కీలకమైనవి.

పొత్తుల ఊసులేనపుడు జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు చంద్రబాబునాయుడు గట్టి అభ్యర్ధులను వెతుకుతున్నారు. మాజీలతోను కొత్త నేతలతోను రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే జనసేన నేతలు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకోసం గట్టిగా పట్టుబట్టారు. ఇప్పటికే ఇక్కడినుండి పోటీచేసేందుకు సీనియర్ తమ్ముళ్ళు తీవ్రంగా కష్టపడుతున్నారు. చివరి నిముషంలో జనసేనతో కుదిరిన పొత్తు కారణంగా ఇక్కడ ఏ పార్టీ పోటీచేస్తుందనే విషయం గందరగోళంగా తయారైంది.

ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైపోయి సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు దాదాపు ఫైనల్ అయిపోయిన నేపధ్యంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. దాంతో పొత్తుచర్చలు మళ్ళీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఎలాగంటే కడప జిల్లాలోనే ఉన్న మరో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గం టికెట్ ను తమకే కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోందట. అంటే రాజంపేట కోసం జనసేన పట్టుబడుతుంటే జమ్మలమడుగు టికెట్ కోసం బీజేపీ పట్టుబట్టింది. ఇక్కడే తమ్ముళ్ళలో వ్యతిరేకత పెరిగిపోతోందట.

ఎందుకంటే పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు గడచిన ఐదేళ్ళుగా తమ్ముళ్ళు బాగా కష్టపడ్డారు. పార్టీ కార్యక్రమాల కోసం, వ్యక్తిగతంగా పట్టు పెంచుకునేందుకు విపరీతంగా డబ్బులు కూడా ఖర్చులు చేసుకున్నారు. అంతా సెట్ చేసుకుని టికెట్ తీసుకుని పోటీచేయటమే మిగిలింది అని అనుకుంటున్న సమయంలో జనసేన, బీజేపీలు పొత్తులో ఈ సీట్ల కోసం పట్టుబట్టడాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారట. మొత్తానికి కడప జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం మూడు పార్టీలు పట్టుబట్టడం ఆశ్చర్యంగానే ఉంది. పొత్తులో బీజేపీ, జనసేనకు సీట్లు వెళిపోతే టీడీపీ నేతలే గెలిపించాల్సుంటుంది.