అధికార వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాజా సంచలనంగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వేళ.. తాను అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నరసరావుపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తనను గుంటూరుకు షిఫ్టు కావాలని కోరారని.. అందుకు తాను ససేమిరా అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.గుంటూరులో ఓటమి పాలైతే.. తనను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని.. అయితే తాను అక్కడకు వెళ్లనని స్పష్టం చేసినట్లుగా పేర్కొన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు కావాలంటూ విధేయత నిరూపించుకోవాలని కొందరు పార్టీ పెద్దలు సూచించినట్లుగా పేర్కొన్నారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాల్నితిట్టాలని ఎమ్మెల్యేల ద్వారా తనకు సమాచారం పంపారని.. ఆ తీరు తనకు నచ్చలేదన్నారు.
ఈ కారణాలతోనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు. పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లామని.. ఆ సందర్భంగా వారికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాన్ని తిట్టాలన్న సూచన చేశారన్నారు. విధేయత ప్రదర్శించుకోవాలంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయాలన్న మాట చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను అలాంటి పనులు చేయనని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత తన విదేయతను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates