ఒక్క శాతం ఓటుకు సీఎం పోస్టా?

ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు ఎంత ఉంది? అంటే త‌డుముకోకుండా.. ఆపార్టీ నాయ‌కులే 1 శాతంలోపే అని చెబుతారు. మ‌రి అలాంటి పార్టీకి అధికారం ద‌క్క‌డం.. సాధ్య‌మేనా? ముఖ్య‌మంత్రి పీఠం ఇవ్వ‌డం స‌మంజ‌స‌మేనా? అనేది కీల‌క ప్ర‌శ్న అయితే.. ఆ పార్టీ నాయ‌కుడు.. విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి మాత్రం కావాల‌నే అంటున్నారు. ఎక్క‌డా కూడా ఒక్క‌శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీల‌కు ఎంత పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ పార్టీలు సీఎం పీఠాన్ని అప్ప‌గించ‌వు. అంతెందుకు.. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌స్తుతం బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌తో పొత్తు పెట్టుకుంది. ఇక్క‌డ బీజేపీకి 32 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఏకంగా 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయినా.. కూడా ఏక్‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రి పీఠం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇక్క‌డ సీఎంగా ఉన్న షిండే వ‌ర్గానికి ఉన్న బ‌లం 42 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. ఈ విష‌యం తెలిసి అన్నారో.. తెలియ‌క అన్నారో.. తెలియ‌దుకానీ.. విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో త‌మ‌కు సీఎం సీటు కావాల‌ని అనేశారు. అంత‌టితోకూడా ఆగ‌లేదు. తాము బ‌లంగా లేమ‌ని అనుకుంటున్న‌ప్పుడు.. ఎందుకు త‌మ వెంట ప‌డుతున్నార‌ని కూడా.. ఆయ‌న ప‌రోక్షంగా టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావ‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌క పోయినా.. త‌మ‌తో పొత్తు పెట్టుకుంటున్నందుకు త‌మ‌కే సీఎం సీటు కావాల‌ని ఆయ‌న కోరారు.

ఏపీలో డబుల్ ఇంజ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. కేంద్రంలో బ‌ల‌మైన బీజేపీ ఉంద‌ని.. ఏపీలోనూ సీఎంసీటు త‌మ‌కే ఇవ్వాల‌ని విష్ణు వ‌ర్థ‌న్ వ్యాఖ్యానించారు. 2014 ప‌రిస్తితి వేర‌ని, 2019 ప‌రిస్థితి వేర‌ని లెక్క‌లు చెప్పిన ఆయ‌న 2024లో వ్యూహాలు ప‌రిస్థితి కూడా వేరేగా ఉంటుంద‌ని అన్నారు. తాము ఎవ‌రినో భుజాల‌పై ఎక్కించుకుని అధికారంలోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం లేద‌న్న తాము బలంగా ఉన్నామ‌ని భావిస్తున్నందునే పొత్తుల కోసం ఢిల్లీలో క్యూ క‌డుతున్నార‌ని.. వేచి ఉంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రావాల‌ని.. బీజేపీనేతే ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయ‌న అన్నారు.

పొత్తు ఇష్టం లేదా.

విష్ణు వ‌ర్ధ‌న్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీతో పొత్తు విష‌యంలో ఈయ‌న‌కు ఇష్టం లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాస్త‌వానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్న 2014 ఎన్నిక‌ల్లో ఒక ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాల‌ను బీజేపీ ద‌క్కించుకుంది. 2019లో ఒంట‌రి పోరు చేసి పూర్తిగా ప‌రాజ‌యం పాలైంది. ఈ విష‌యం తెలిసి కూడా.. పొత్తుల‌పైనా.. ముఖ్య‌మంత్రి సీటుపైనా విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.