బాచిన జంప్‌.. చీరాల టికెట్ ఖాయ‌మేనా!

వైసీపీకి భారీ షాక్ త‌గ‌లింది. ఇది వ్య‌క్తి గ‌తంగానే కాదు.. విశ్వాసంపై కూడా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వైసీపీ కీల‌క నాయ‌కుడు.. బాచిన చెంచు గ‌ర‌ట‌య్య కుటుంబం.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబును బాచిన వార‌సుడు బాచిన కృష్ణ చైతన్య క‌లిశారు. చీరాల టికెట్‌ను ఈ కుటుంబం ఆశిస్తోంది. వాస్త‌వానికి అద్దంకి నేటివ్ ప్లేస్ అయినా.. ఇక్క‌డ టీడీపీకి గొట్టి పాటి ర‌వి కుమార్ ఉన్నారు. దీంతో ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబును క‌లిసిన బాచిన కృష్ణ చైత‌న్య‌.. ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. టికెట్ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ఇంకా చంద్ర బాబు నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిసింది. ఇదిలావుంటే.. వైసీపీలో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి గ‌ర‌ట‌య్య కుటుంబం ఉంది. స్తానికంగా మంచి పేరు కూడా సంపాయించుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గొట్టిపాటి ర‌విత‌ర్వాత కాలంలో టీడీపీలోకి జంప్ చేశారు.

దీంతో త‌మ‌కు లైన్ క్లియ‌ర్ అయింద‌ని.. భావించిన గ‌ర‌ట‌య్య కుటుంబం మ‌రింత ఎక్కువ‌గానే వైసీపీ కోసం పనిచేసింది. అంతేకాదు. కృష్ణ చైత‌న్య సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర కూడా మంచి మార్కులు సంపాయించు కున్నారు. కానీ, వైవీ వ‌ర్గంగా కాకుండా.. ఈయ‌న బాలినేని వ‌ర్గంగా పేరు తెచ్చుకున్నారు. దీంతో అప్ప‌టి నుంచి పార్టీలో కృష్ణ చైత‌న్య‌కు గ్రాఫ్ త‌గ్గుతూ వ‌చ్చింద‌నే టాక్ ఉంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే కొన్నాళ్లుగా టికెట్ కూడా ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై ఏదో ఒక‌టి తేల్చుకుందామ‌ని అనుకున్న కృష్ణ చైత‌న్య‌కు కూడా.. పార్టీ అధిస్టానం నుంచి ఎలాంటి సందేశం రాక‌పోగా.. క‌నీసం అప్పాయింట్ మెంట్ కూడా ల‌భించ‌లేదు.

ఈ ప‌రిణామాల‌తో కొన్నాళ్లుగా టీడీపీకి చేరువ అయ్యారు. దీనిని గ్ర‌హించిన వైసీపీ పూర్తిగా చైతన్య‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఇక‌, ఇప్పుడు చైత‌న్య త‌న దారి తాను చూసుకున్నారు. టీడీపీలోకి వ‌చ్చేందుకు పూర్తిగా సంసిద్ధుల‌య్యారు. ఆయ‌న టికెట్ వ్య‌వ‌హారం ఎలా ఉన్నా. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో వైసీపీకి మ‌రింత ఇబ్బంది అయితేఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప‌రిణామాలు.. టీడీపీకి జిల్లాలో తిరుగులేని విజ‌యాన్ని అందిస్తాయ‌ని చెబుతున్నారు.