రాజధానిపై కొత్త డ్రామా

రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు.

విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణాకు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలిసిందే. పేరుకే ఉమ్మడి రాజధాని కాని హైదరాబాద్ నుండి చేసిన పరిపాలన ఏమీలేదు. కాబట్టి వైవీ డిమాండ్ చేస్తున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలనే డిమాండులో అర్ధం లేదు. ఒకవేళ కేంద్రం పొడిగించినా ఏపీకి జరిగే ఉపయోగం ఏమీలేదు. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఉపయోగంలేని డిమాండును వైవీ సడెన్ గా ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు.

మాజీ ఎంపీ చెబుతున్నది ఏమిటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్మించేంతవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలట. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మించేదెప్పుడు ? పైగా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రకటించలేదు. బాగా డెవలప్ అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారంతే. కొతమొత్తం ఖర్చులు పెట్టుకుంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ అయిపోతుందని మాత్రమే జగన్ చెప్పారు. దీనికోసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరంలేదు. ఈ డిమాండ్ చేయటం కన్నా హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే ఏమన్నా ఉపయోగముంటుందేమో.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు జరిగిపోతాయి. జగనే రెండోసారి గెలిస్తే వైజాగ్ పరిపాలనా రాజధాని అయిపోవటం ఖాయం. ఒకవేళ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతే రాజధానిగా కంటిన్యు అవుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి కొత్త డిమాండ్లతో జనాల్లో అనవసరమైన గందరగోళం పెంచటం తప్ప మరే ఉపయోగం లేదు.