రేవంత్.. ఇలా చేస్తే మంచి పనే

తెలంగాణాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతికి బాధ్యులపై రెవిన్యు రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. రెవిన్యు రికవరీ యాక్ట్ ప్రయోగం అన్నది మామూలుగా జరగదు. అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే ఈ యాక్ట్ ను గుర్తించిన బాధ్యుతలపై ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందని రేవంత్ పదేపదే అంటున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసుకోవటం ఒక ఎత్తయితే, ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించి కోట్లాది రూపాయలు వృధాగా తేలుతోంది.

దీనిపైనే రేవంత్ ప్రభుత్వం మండిపోతోంది. అయితే ఎవరిపైన రెవిన్యు రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారన్నదే అర్ధంకావటం లేదు. ప్రాజెక్టులపై జరిగిన సమీక్షల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమంతా మొత్తం కేసీయార్ పర్యవేక్షణలోనే జరిగిందని అధికారులు చెప్పారు. ఒకపుడు కేసీయార్ మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేసినట్లు గొప్పగా ప్రకటించుకున్నారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చేయాల్సిన పనిని కేసీయార్ ఎలాగ చేశారో అర్ధంకావటం లేదు. ఇదే విషయాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు అడిగినా కేసీయార్ సమాధానం చెప్పలేదు.

పదేళ్ళ పాలించి బీఆర్ఎస్ తప్పుకోగానే అప్పట్లో జరిగిన అవినీతి మొత్తం ఇపుడు కాంగ్రెస్ బయటపెడుతోంది. మేడిగడ్డ బ్యారేజిలో నాసిరకం నిర్మాణం, రీ డిజైనింగ్ చేయటం ద్వారా వేలకోట్ల రూపాయలు వృధా అయిన కాళేశ్వరం ప్రాజెక్టు టార్గెట్ రీచవ్వలేదు అని సర్కారే చెబుతోంది. 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సిన ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీటిని అందించలేకపోయిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుపై ఇప్పటికి రు .98 వేల కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది.

అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కనీసం దాని వల్ల లక్ష ఎకరాలకు కూడా నీరందలేదని తేలింది. ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవటం, సాగునీటి ఆయకట్టకు నీరందకపోవటం, మేడిగడ్డ బ్యారేజిలో నాసిరకం నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బాధ్యుతలను చేయాలి . కేసీయార్ మొత్తానికి బాధ్యుడంటు రేవంత్ ఇప్పటికే తేల్చేశారు. కానీ ప్రకటన కార్యరూపంలోకి వచ్చేటప్పటికి రేవంత్ ప్రభుత్వం తనపైన కక్షసాధింపులకు దిగుతోందని కేసీయార్ రోడ్డు ఎక్కుతారు. బీఆర్ఎస్ నేతలంతో గోలగోల మొదలుపెడతారు. అధికారులపైన యాక్షన్ తీసుకోవాలంటే మొత్తం కేసీయార్ చేసినపుడు తమపైన యాక్షన్ ఎలాగ తీసుకుంటారని కోర్టుకెక్కుతారు. అందుకనే రెవిన్యు రికవరీ యాక్టు ప్రయోగం సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతోంది.