తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి సెంటిమెంటు డైలాగులు పేల్చారు. పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. తొలిసారి ఆయన నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. “కాలు విరిగినా.. కట్టెపట్టుకుని నల్లగొండకు వచ్చినా” అంటూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సారి ఆయన సభలో కుర్చీలో కూర్చునే మాట్లాడడం గమనార్హం. తుంటి ఆపరేషన్ జరగడంతో నిలబడలేక పోతున్న నేపథ్యంలో సభలో కూర్చుని ప్రసంగించారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదన్న కేసీఆర్.. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగి పోయాయని, కాళ్లు మెలితిరిగిపోయాయని తెలిపారు. అయితే.. ఈ సమస్యను తాము గత పదేళ్ల పాలనలో పరిష్కరించేందుకు మనసా వాచా కర్మణా పనిచేశామన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానికి చూపించామన్నారు.
ఇక, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా కేసీఆర్ ఇదే వేదికగా సమాధానం చెప్పారు. ఓట్లు వచ్చినప్పుడే కొందరు ప్రజల వద్దకు వస్తారని అన్న ఆయన.. తాను నిరంతరం.. పక్షిలాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగానని తెలిపారు. తన పాలనలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపోవడంతో తనకు నిద్దర పట్టేది కాదన్నారు. అందుకే.. అనేక సందర్భాల్లో జల విషయాలపై పోరాటం చేశామన్నారు. తమ హయాంలో చేపట్టిన బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యిందని, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. “నా ప్రాంతం.. నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చు” అని తెలిపారు.