తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకపుడు టీడీపీ తరపున ఎస్సీ సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత వర్ల కాదు కంభంపాటి రామ్మోహన్ రావు పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఇపుడేమో అసలు టీడీపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి కనబడటం లేదు. నామినేషన్ల దాఖలకు 15వ తేదీ ఆఖరు.
వైసీపీ తరపున పోటీ చేయబోతున్న గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డికి జగన్మోహన్ రెడ్డి బీ ఫారాలను అందించారు. ఈరోజే రేపో వీళ్ళు నామినేషన్లు వేయబోతున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు వేరే ఎవరు నామినేషన్లు వేయకపోతే వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లే. వైసీపీ తరపున ముగ్గురిని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేట్లు చేయలానే ప్రశ్న టీడీపీలో బలంగా వినబడుతోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పోటీ పెట్టేందుకు అవసరమైన ఓట్ల బలం లేదు.
ఇపుడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 174. ఇందులో వైసీపీ తరపున 151 మంది ఉంటే టీడీపీ తరపున 22 మందే ఉన్నారు. తాజా సంఖ్యా బలాన్ని బట్టి ప్రతి రాజ్యసభ ఎంపీకి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురికి కలిసి 129 ఓట్లు అవసరం. వైసీపీకి ఉన్న బలంతో చాలా ఈజీగా ముగ్గురిని గెలిపించుకుంటుంది. అదే టీడీపీ విషయం చూస్తే 22 మంది ఎంఎల్ఏలకు మరో 21 మంది ఎంఎల్ఏల మద్దతిస్తే కాని ఒక అభ్యర్ధిని గెలిపించుకునే అవకాశంలేదు.
ఇంతమంది ఎంఎల్ఏల మద్దతు కావాలంటే వైసీపీ నుండే లాక్కోవాలి. అన్నీ కోణాల్లో చూసిన తర్వాత అంతమందిని టీడీపీకి మద్దతుగా లాక్కోవటం తేలికకాదని అర్ధమైపోయిందట. ఆ మధ్య ఎంఎల్సీ ఎన్నికల్లో అవసరమైన నలుగురు ఎంఎల్ఏల ఓట్లను లాక్కున్నంత ఈజీకాదు 21 మంది ఎంఎల్ఏల ఓట్లను లాక్కోవటం అని తీర్మానించుకున్నారట. బలంలేనపుడు పోటీలోకి దింపటం ఎందుకులే అని సీనియర్ తమ్ముళ్ళు చంద్రబాబునాయుడుతో చెప్పారట. అందుకనే టీడీపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ఎక్కడా కనబడటం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates