బాబు సీఎం కాకూడదని కేసీఆర్ ప్లాన్ చేసి ఓడించారు – జూపల్లి

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు బీఆర్ ఎస్ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంపూర్ణంగా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. టీడీపీ అధినేత‌, అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. “కేసీఆర్‌కు చంద్రబాబుకు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావించారు. జగన్‌కు రాజకీయ లబ్ధి కలగాలనే కేసీఆర్‌ సహకరించారు. రాయలసీమ ఎత్తిపోతలకూ మద్దతిచ్చారు” అని జూప‌ల్లి వెల్ల‌డించారు.

తెలంగాణ అసెంబ్లీలో కృష్ణాన‌ది జ‌లాల‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో జూప‌ల్లి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిం చిన తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. నదీ జలాల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నార‌ని బీఆర్ ఎస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. జల వివాదాల‌ను పరిష్కరించకుండా కేంద్రానికి బీఆర్ ఎస్ ఎందుకు మద్దతు తెలిపింద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యాన్ని చూపించి ఏపీలో విలీనం చేసిన‌ప్పుడు బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

కేంద్రం వద్ద బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మోక‌రిల్ల‌లేదా? అని జూప‌ల్లి నిల‌దీశారు. పదేళ్లపాటు కేసీఆర్‌ సర్కారు న్యాయమైన తెలంగాణ వాటా సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బుకాయిస్తున్నారని స‌భ‌లో జూప‌ల్లి మండిప‌డ్డారు. “సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీశ్‌రావు చెప్పగలరా? ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై నేను ఆధారాలు చూసిస్తా” అని జూప‌ల్లి వ్యాఖ్యానించారు.

రాయ‌ల‌సీమ‌కు సంబంధించిన ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు కేసీఆర్ స్వ‌యంగా అనుమ‌తి ఇచ్చార‌ని.. ఈ విష‌యం బీఆర్ ఎస్‌నేత‌ల‌కు కూడా తెలుసున‌ని జూప‌ల్లి వ్యాఖ్యానించారు. “చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగ‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌నీసం స‌మాధానం చెప్ప‌డానికికూడా వారికి మ‌న‌సు రావ‌డం లేదు” అని జూప‌ల్లి విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, 2019 ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓడిపోయింది. కేవ‌లం 23 స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.