టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ సీఎంలు అయ్యారని, వారిద్దరూ చంద్రబాబు శిష్యులేనని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రొడక్టులేనంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లనుద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీడీపీ ఒక యూనివర్సిటీ వంటిదని, అందులోనుంచి వచ్చిన ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులు అయ్యారని లోకేష్ అన్నారు. పసుపు జెండా చూస్తే నూతన ఉత్తేజం కలుగుతుంని, అది పార్టీ గొప్పదనం అని కార్యకర్తల్లో లోకేష్ ఉత్సాహం నింపారు. దేశంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు లోకేష్. టీడీపీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల రూపాయల భీమా అందించామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.100 కోట్లు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టామన్నారు.
చంద్రబాబుని తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారనని, తనపై కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసుతోపాటు పలు కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలపై జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని, బహిరంగచర్చకు సిద్ధమా? అని లోకేష్ ఛాలెంజ్ చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100కి పైగా కేసులు ఈ ప్రభుత్వం పెట్టిందని, అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులకు కార్యకర్తలు, నేతలు భయపడవద్దని, ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులుంటే వారికి నామినేటెడ్ పదవి ఇస్తానని లోకేష్ అన్నారు.
ఇక, చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేస్తే పవన్ కల్యాణ్ మనకు అండగా నిలబడ్డారని, హలో ఏపీ-బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారని గుర్తు చేసుకున్నారు. అపోహలకు తావులేకుండా ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates