మొన్న హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు. నేడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు. విచారణ తర్వాత అరెస్టుచేసే అవకాశముందనే ప్రచారం. వీళ్ళిద్దరు అవినీతి కేసుల్లో బాగా కూరుకుపోయారు. ప్రభుత్వం గట్టిగ కన్నెర్రచేస్తే గిలగిల్లాడిపోవాల్సిందే. వీళ్ళిద్దరిపై ప్రభుత్వం పట్టు బగిస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కాబట్టే. ఇపుడు తగులుకున్న వీళ్ళిద్దరు మాజీమంత్రి కేటీయార్ కు అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులట.
రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటి) డైరెక్టర్ బాలకృష్ణ వయా అరవింద్ పై నుండి ప్రభుత్వం గురిపెట్టింది కేటీయార్ పైనే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే బాలకృష్ణ అయినా అరవింద్ అయినా కేటీయార్ కు అత్యంత సన్నిహితులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో వీళ్ళిద్దరు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. పైగా వీళ్ళిద్దరు కేటీయార్ నిర్వహించిన శాఖ మున్సిపాలిటిలో కీలకస్ధానాల్లో పనిచేశారు. వీళ్ళని అడ్డుపెట్టుకునే కేటీయార్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డమైన అనుమతులు ఇప్పించారని కేటీయార్ పైన ఇపుడు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
అంటే వీళ్ళ అవినీతిలో సింహభాగం కేటీయార్ దే అని ప్రభుత్వవర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాలకృష్ణ, అరవింద్ సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత వీళ్ళ మాజీ బాసు వ్యవహారాలు బయటపడతాయని మంత్రులు కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన భూ వ్యవహారాలు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లన్నీకేటీయార్ ఆదేశాల ప్రకారమే వీళ్ళు నడుచుకున్నారని అధికారపార్టీ నేతలంటున్నారు.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వమని అరవింద్ చెప్పటం, బాలకృష్ణ ఆమోదిస్తు సంతకాలు చేయటం అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఇపుడు ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకనే ముందుగా బాలకృష్ణను పట్టుకున్నారు. విచారణలో అన్నీ వ్యవహారాలను బాలకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పేశారట. అవినీతి సంపాదనలో ఎవరెవరి వాటా ఎంతనే విషయాలను కూడా మాజీ డైరెక్టర్ ఆధారాలతో సహా చెప్పేశారట. అందుకనే అరవింద్ కు ఏసీబీ నోటీసులు జారీచేసింది. మరిపుడు అరవింద్ విచారణలో ఏమి చెబుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.