కేసీఆర్ సీటును ప‌ద్మారావుకు ఇవ్వండి: రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి బాధ్య‌త‌ల‌ను, హోదాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావుకు ఇవ్వాల‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారం అసెంబ్లీలో కృష్ణాన‌ది జ‌ల అంశంపై ప్ర‌ధాన చ‌ర్చ‌సాగింది. ఈ క్ర‌మంలో మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేశారు. న‌ది ప‌రివాహ‌క ప్రాంతం స‌హా.. ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి? ఎంత మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతోంది? కేంద్రం ఎందుకు ఈ ప్రాజెక్టుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతోంది? వంటి అనేక అంశాల‌పై చ‌ర్చ ప్రారంభించారు.

ఈ స‌మ‌యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పాలమూరు జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాల మీద చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు(కేసీఆర్) ఇక్కడకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా?. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68 శాతం వాటా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని ఒక ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్ధతు పలికి.. ఒక సందేశాన్ని పంపాల్సిన సమయం, సందర్భంలో సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో దాక్కొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మిగతావారిని పంపించి పచ్చి అబద్దాలు ఆడిపిస్తున్నడు“ అని వ్యాఖ్యానించారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌తిపక్ష నాయ‌కుడు కేసీఆర్‌కు కేటాయించిన సీటు వంక వేలు చూపిస్తూ.. ఆ సీటు నాలుగు రోజులుగా ఖాళీగా ఉంటోంద‌ని, ఈ రోజు సీనియ‌ర్ నేత అయిన‌.. ప‌ద్మ‌రావు అందులో కూర్చున్నార‌ని సీఎం రేవంత్ అన్నారు. ఆయ‌న‌కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత బాధ్య‌త‌లు, హోదా అప్ప‌గిస్తే.. మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. తెలంగాణ కోసం.. ప‌ద్మారావు కూడా ఎంతో శ్ర‌మించార‌ని.. కేసులు కూడా పెట్టించుకున్నార‌ని అన్నారు. ఈ స‌మయంలో బీఆర్ ఎస్ నేత‌ల నుంచి వ్య‌తిరేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మెజారిటీ స‌బ్యులు స్వాగ‌తించ‌డం గ‌మ‌నార్హం.