‘జ‌గ‌న్ త‌న‌ను తాను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నా ఓట‌మి ఖాయం’

“జ‌గ‌న్ కొత్త‌గా ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాడు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఒక చోట నుంచి మ‌రో చోట‌కు మారుస్తున్నాడు. అంటే.. ఒక చోట ప‌నికిరాని నాయ‌కుడు, ఓడిపోయే నాయ‌కుడు.. మ‌రొక‌చోట గెలుస్తాడ‌ని ఆయ‌న అనుకుంటున్నాడు. పక్కింటి చెత్త మ‌న‌కు ప‌నికి వ‌స్తుందా? ఇది కూడా అంతే.. జ‌గ‌నే స్వ‌యంగా త‌న సీటు మార్చుకుని బ‌దిలీ అయి.. వేరే చోట నుంచి పోటీ చేసినా వైసీపీ ప‌రాజ‌యాన్ని ఎవ‌రూ ఆపలేరు. ఈ సారి టీడీపీ-జ‌న‌సేన గెలుపు ఖాయం. ఇది రాసిపెట్టుకోండి” అని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు.

శంఖారావం పేరిట ఆదివారం ప్రారంభించిన యాత్ర‌.. సోమ‌వారం.. శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో జ‌రిగింది. రోజుకు మూడు చోట్ల ఆయ‌న స‌భ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో న‌ర‌సన్న‌పేట‌లో నారా లోకేష్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు బుద్ది చెప్పేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో దేశాన్ని వ‌దిలి పారిపోయేందుకు జ‌గ‌న్ కూడా సిద్ధంగానే ఉన్నాడ‌ని అందుకే.. సిద్ధం.. సిద్ధం.. అంటూ కామెంట్లు చేస్తున్నాడ‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌ను నిండా ముంచింద‌ని నారా లోకేష్ అన్నారు. త‌మ ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఏటా 20 వేల మంది కొత్త ఉపాధ్యాయుల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పారు. “నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు. 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్‌ మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30 వేల పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం” అని ప్ర‌క‌టించారు.

జ‌గ‌న్ దోపిడీకి అనేక ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చ‌ని నారాలోకేష్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటుకు 10 వేలు ఇచ్చినాఆశ్చ‌ర్యం లేద‌ని.. అలా దోచుకున్నార‌ని.. ప్ర‌జ‌లు కూడా డ‌బ్బులు తీసుకుని.. ఓటు మాత్రం చంద్ర‌బాబుకు వేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వం రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని తేల్చి చెప్పారు.