బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మీడియా ముందు రేవంత్‌ను ఉద్దేశించి చెప్పు చూపించిన వ్యవహారం మంటలు రేపింది. దీంతో ఆయన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో బాల్క కొన్ని రోజులు తప్పించుకుపోయారు. తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన తన పంథా మార్చుకోలేదు. తీవ్రస్థాయిలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని క్రిమినల్ అంటూ వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులు ఇవ్వడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తనమీద కేసు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని, నిన్ననే సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అయినప్పుడు, ఆయన నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ రెండు నెలల పాలన అత్యంత దౌర్భాగ్యంగా ఉంది. బీఆర్ఎస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలి
అని అన్నారు. కాగా.. బాల్క వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మరో కేసుకు రెడీ అవుతున్నారు. సీఎం రేవంత్‌ను క్రిమినల్ అని వ్యాఖ్యానించడాన్ని వారు తప్పుబడుతున్నారు.