ఔను.. గుంటూరు జిల్లాలో ఈ మాటే వినిపిస్తోంది. “రెడ్డిగారు కనిపించడం లేదు. ఆయన రాజకీయం మాటేంటి? ” అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఆయనే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. పార్టీలు మారిన ఫలితమో.. లేక వ్యూహం లేక పోవడమో.. ఇవన్నీ కాకుండా.. తాను పట్టిన కుందేలు కు మూడుకాళ్లే అన్నటైపులో రాజకీయాలు చేయడమో.. ఏదేమైనా.. మోదుగుల రాజకీయాలు ముందుకు సాగడం లేదు. తొలుత ఈయన రాజకీయం టీడీపీతో ప్రారంభమైంది.
ప్రస్తుతం వైసీపీ నాయకుడు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి స్వయానా బావమరిది అయిన.. మోదుగుల 2009లో టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా పనిచేశారు. అయితే.. ఆయన వ్యాపారాల రీత్యా మంత్రి కావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో పట్టుబట్టి.. ఎమ్మెల్సీ సీటును అదే పార్టీలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఓడించి విజయం దక్కించుకున్నారు. కానీ, మంత్రి పదవి మాత్రం మోదుగులను వరించలేదు.
దీంతో 2018 నాటికి రెబల్‌గా మారి.. టీడీపీ పాలనపై విమర్శలు చేశారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యత గురించి.. అనేక సభలు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ బాట పట్టారు. దీంతో మరోసారి ఆయన ఎంపీగా గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత.. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు. కానీ, అది కూడా దక్కలేదు. ఇక, ఆ తర్వాత నుంచి ఆయన కనిపించడం మానేశారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు టికెట్ల కోసం.. పార్టీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. చిన్న చితకా నాయకుల నుంచిసీనియర్ల వరకు టికెట్ రేసులో ముందున్నారు. కానీ, మోదుగుల మాట మాత్రం ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. మరి . ఆయన వ్యూహం ఏంటనేది చూడాలి. లేక, ఇక, రాజకీయాల నుంచి విరమించుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక పార్టీలో నిలబడక పోవడం.. తనకంటూ.. ప్రజలను చేరువ చేసుకోకపోవడం మైనస్‌లుగా మారాయనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates