వారి చెంప ప‌గ‌ల‌గొట్టండి.. ప్ర‌జ‌ల‌కు నాగ‌బాబు పిలుపు

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నటుడు నాగ‌బాబు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌కుండా.. క‌నీసం రోడ్డు కూడా వేయ‌కుండా.. నాయ‌కులు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “క‌నీసం ఒక్క రోడ్డు కూడా వేయ‌ని వైసీపీ నాయ‌కులు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు త‌యార‌య్యారు. ఓటువేయాలంటూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌జ‌లు వాళ్ల చెంప ప‌గ‌ల‌గొట్టి.. కాల‌ర్ ప‌ట్టుకుని, మాకు ఏం చేశారో చెప్పండి! అని నిల‌దీయాలి” అని నాగ‌బాబు పిలుపునిచ్చారు.

మంత్రిపై విమ‌ర్శ‌లు..

వైసీపీ నాయ‌కుడు, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌పైనా నాగ‌బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గంజాయి ర‌వాణాలో మంత్రి పాత్ర ఉంద‌ని.. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గంజాయిని నిల్వ చేస్తున్న‌ట్టు అంద‌రూ చెబుతున్నారు. ఇలాంటి మంత్రి పేరు చెప్పాలంటేనే నోరు పాడైపోతుంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వీళ్లా మంత్రులు? అంటూ.. నిల‌దీశారు. “రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికిన ఏజెన్సీ ప్రాంతాన్నే చూపిస్తున్నారు, ఇది చాలా బాధాకరం. కానీ, వాస్త‌వం ఏంటంటే అన‌కాప‌ల్లిలోనే గంజాయి నిల్వ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచే ఆ మంత్రి ప‌ర్య‌వేక్షిస్తున్నాడు” అని నాగ‌బాబు అన్నారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్యోగాలు

టీడీపీ-జ‌న‌సేన అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని నాగ‌బాబు అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌తి అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం ప‌రిధిలోనూ 500 మంది యువ‌తీయువ‌కుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని తెలిపారు. ఈ బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని నాగ‌బాబు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌న్నారు. తాము వ‌చ్చాక‌.. ర‌హ‌దారుల‌ను అద్దాల్లా తీర్చిదిద్దుతామ‌ని హామీ ఇచ్చారు.

“ఒక్క స‌మీక్ష అయినా పెట్టాడా? రాష్ట్రంలో ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో 35 వేల మంది యువ‌తులు, మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యారు. వీరిలో 25 వేల మంది మ‌హిళ‌ల జాడ ఇప్ప‌టికీ క‌నిపించ‌డం లేదు. ఈ ముఖ్య‌మంత్రికి ఇవేవీ క‌నిపించ‌డం లేదు” అని నాగ‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.