రాజ్యసభ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ లో ఖాళీ అవబోయే మూడు స్ధానాలను భర్తీచేసేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈనెల 27వ తేదీ ఎన్నిక నిర్వహించబోతోంది. మూడు స్ధానాల్లో రెండింటిలో కాంగ్రెస్, ఒకదాన్ని బీఆర్ఎస్ గెలుచుకోగలవు. ఈ విషయంలో పై రెండు పార్టీలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే మూడోసీటును కూడా గెలుచుకునేందుకు రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట.
ఈ విషయం తెలియగానే కేసీయార్ లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ మూడోసీటుపైన కన్నేసిందంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కునే ఉద్దేశ్యంతోనే అయ్యుంటుందని ఎవరైనా ఊహించగలరు. బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎంఎల్ఏలు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో ఎవరికీ ఓట్లేయరు కాబట్టే. అందుకనే బీఆర్ఎస్ క్యాంపులో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే కారు పార్టీనుండి ఎంతమంది ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే ప్రాబబులిటీస్ ఆలోచిస్తున్నారట.
ఈమధ్యనే ఐదుగురు ఎంఎల్ఏలు రేవంత్ ను కలిసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కలిసారన్న విషయం తెలియగానే పార్టీలో కలకలం మొదలైంది. తామంతా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. వివరణ నిజమే అయినా దాన్ని ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు అలాగున్నాయి కాబట్టి. పైగా ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించినా ఎవరిపైనా అనర్హత వేటుపడే అవకాశాలు లేవనే ధైర్యం వచ్చేసింది అందరికి. అందుకనే యధేచ్చగా పార్టీని ఫిరాయించేస్తున్నారు.
మూడో సీటును గెలుచుకోవాలంటే కాంగ్రెస్ కు చేతిలో ఉన్నవి కాకుండా అదనంగా 21 మంది ఎంఎల్ఏల బలం అవసరం. అందుకోసమే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను దృష్టిలో పెట్టుకునే మూడో క్యాండిడేట్ ఆలోచన చేస్తున్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ తరపున ఎవరైనా ఎంఎల్ఏలు బీఆర్ఎస్ అభ్యర్ధికే ఓట్లేయాలనే పద్దతిలో విప్ జారీచేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీచేసే అవకాశంలేదు. కాబట్టి ఎవరికి ఓట్లేయాలనే విషయంలో ఎంఎల్ఏలకు పూర్తిస్వేచ్చుంది. మహాయితే అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లెటర్ పెట్టుకుంటారంతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates