పొత్తులపై కామెంట్లు చేసే జనసేన నేతలకు పవన్ వార్నింగ్

ఏపీలో త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, టీడీపీ జనసేనలతో బిజెపి కూడా కలిసే అవకాశాలపై ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పొత్తులపై జనసేన పార్టీ శ్రేణులు ఎటువంటి విమర్శలు చేయొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కోరారు. జనహితం కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని పవన్ చెప్పారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని పవన్ స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించి కీలకమైన చర్చలు జరుగుతున్న సందర్భంలో భావోద్వేగాలతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎటువంటి కామెంట్లు చేయవద్దని పవన్ సూచించారు. ఆ రకమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.

ఒకవేళ ఏమైనా అభిప్రాయాలు, సందేహాలు ఉంటే జనసేన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించారు. ఆ రకంగా తమ ఆలోచనలను, సలహాలను, భావోద్వేగాలను పార్టీకి చేరవేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక, పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేసిన నాయకుల నుంచి వివరణ కోరుతున్నామని చెప్పారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, పొత్తులపై చర్చలు జరుగుతున్న ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.