ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఆయన ప్రధాన మంత్రి నరేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నికలకు ముందు జరిగిన.. అధికారిక పర్యటనపై ప్రభుత్వ వర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజకీయ వర్గాల్లో మరో విధమైన చర్చసాగుతోంది. దీంతోఅసలు జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించారనేది ఆసక్తిగా మారింది.
ముందుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. పెండింగులో ఉన్న ఏపీ సమస్యల పైనే సీఎం జగన్ దృష్టి పెట్టారని అంటున్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా, దీంతో పాటు విభజన చట్టంలోని హామీలపైనా సీఎం జగన్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల వంటి కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్లారని అంటున్నారు.
అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం దీనికి భిన్నంగా వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ చర్చించి ఉంటారనేది వీరి వాదనగా ఉంది. ముఖ్యంగా పొత్తుల వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచిన దరిమిలా.. అలాంటి అవసరం ఎందుకన్న వాదనను సీఎం జగన్ ప్రస్తావించి ఉంటారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు.. తాము పరోక్షంగా సహకరించే అవకాశాన్ని చర్చించారనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
అదేసమయంలో బీజేపీ ఒంటరి పోరుకు దిగితే.. తమ సర్కారు మరోసారి వచ్చే అవకాశం ఉంటుందని.. తద్వారా.. తాము కేంద్రానికి సహకరిస్తామని పరోక్షంగా సీఎం జగన్ చెప్పి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టికెట్ల పంపిణీ వ్యవహారంతోపాటు.. వచ్చే ఎన్నికలలో తాము పెట్టుకున్న టార్గెట్, కాంగ్రెస్ వ్యవహార శైలి, ముఖ్యంగా తన సోదరి షర్మిల దూకుడు వంటి అంశాలను కూడా.. నేరుగా ప్రధానితోనే జగన్ చర్చించి ఉంటారనేది ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates