స్వతంత్ర భారత దేశంలో ఒకే సంవత్సరం.. ఐదుగురికి అత్యున్నత పౌర పురస్కారాలను అందించిన ఘనత ప్రదాని నరేంద్ర మోడీకే దక్కనుంది. అయితే.. ఈ ఐదు రాత్నాలు పొందిన వారిలో జీవించి ఉన్న వారు ఇద్దరే. మిగిలిన ముగ్గురు జీవించి లేరు. సో.. భారత రత్నాలు ప్రకటించిన వారికి కీర్తి దక్కితే.. ఆ రత్నాల శోభ మాత్రం నిక్కచ్చిగా దక్కేది ప్రధాన మంత్రినరేంద్ర మోడీకే! ఆశ్చర్యంగా అనిపించినా నిజం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఒకరిద్దరికి మాత్రమే ఇస్తుంది. కానీ, ప్రధాని మోడీ.. చాలా వ్యూహాత్మకంగా.. రత్నాలను ఎంపిక చేశారు.
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు.. ఈ రత్నాలు పొందిన వారిలో ఉన్నారు. తొలుత బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ కు, తర్వాత.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించారు. ఇప్పుడు ఒకే రోజు ఏకంగా ముగ్గురికి ఇచ్చారు. వీరిలో ఇద్దరు దేశ ప్రధానులు ఉన్నారు. వారిద్దరూ కూడా.. కాంగ్రెస్ ఛీత్కారాలకు గురైన వారే. కాంగ్రెస్ ప్రధానిగా పదవిని చేపట్టిన పీవీ నరసింహారావును తర్వాత.. ఆ పార్టీ పక్కన పెట్టింది. ఇక, చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పడిన ఆనాటి ఇందిరమ్మ.. కేవలం 23 రోజుల్లోనే ఆయనకు మద్దతు ఉపసంహరించి.. ప్రభుత్వం కూలిపోయే లా చేసింది.
ఈ రెండు పరిణామాలు కూడా.. కాంగ్రెస్‌కు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాయనడంలో సందేహంలేదు. ఇక, ఇప్పుడు మరింతగా ఇబ్బంది పెట్టేలా చాలా వ్యూహాత్మకంగా ప్రధాని వీరికి రత్నాలు ప్రకటించారు. బిహార్ లో బీసీ సామాజిక వర్గాన్ని బీజేపీవైపు తిప్పుకొనేలా కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించారనే వాదన ఉంది. ఇక, అద్వానీకి భారతరత్న ప్రకటించడం వెనుక.. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లో తనకు తిరుగులేని ఆధిపత్యం దిశగా మోడీ అడుగులు వేశారు.
ఇప్పుడు తెలుగు వాడైన పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం ద్వారా.. దక్షిణాదిలో ఊపు తెచ్చుకునే దిశగా బీజేపీ అడుగులు వేసిందనే చెప్పాలి. ఇక, చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్నలు ప్రకటించడం ద్వారా.. మోడీ కాంగ్రెస్‌కు మరింత ఉచ్చు బిగించారనే వాదన వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా.. రత్నాలు వారికి దక్కినా.. అసలైన `పదవీ రత్నం` మాత్రం మోడీకి దక్కుతుందని అంటున్నారు మేధావులు. టార్గెట్ @ 400 అని ప్రవచిస్తున్న నరేంద్ర మోడీ ఆదిశగా తన వ్యూహాలకు బాగానే పదును పెడుతున్నారని చెబుతున్నారు.