ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ పాగా వేస్తుందా? టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు తథ్యమా? ఆయన ఖచ్చితంగా మళ్లీ శాసనసభలో అడుగు పెడ తారా? అంటే గుంటూరు జిల్లా పొలిటికల్ వాతావరణంతో పాటు జిల్లా రాజకీయ విశ్లేషకులు నూటికి నూరు శాతం అవుననే అంటున్నారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేకపోవడం, వైసీపీలో అంతర్గత కుమ్ములాటలే. ప్రస్తుతం పేట నుంచి మంత్రి విడదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేసి గెలిచిన రజనీ ఆ తర్వాత మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో అభివృద్ది లేదు. వైసీపీలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గ్రూప్‌తో ఆమెకు అస్సలు సఖ్యత లేదు. తాజాగా ఆమెను గుంటూరు వెస్ట్‌కు బదిలీ చేశారు. వాస్తవానికి ఇలా బదిలీ చేశారంటేనే.. అక్కడ ఆమెపై వ్యతిరేకత ఉందని పార్టీ పరోక్షంగా ఒప్పుకొన్నట్టే కదా! ఇక, ఈ స్థానంలో మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త వ్యక్తిని తీసుకువచ్చి.. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా నియమించారు.
కానీ, ఆయన ఎమ్మెల్యే స్థాయికి సరితూగే నాయకుడు కాదనే చర్చ పార్టీలోనే ఉంది. పైగా ఆర్థికంగాను, అంగ బలంగా చూసుకున్నా.. ఆయన.. ప్రత్తిపాటికి సరితూగే నాయకుడు కాదని అంటున్నారు. దీంతో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు పక్కా అన్న వాతావరణమే ఉంది. ఆయన గతంలో చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, ఆర్థికంగా దన్ను. . వంటివి ప్రత్తిపాటికి తిరుగులేకుండా చేస్తున్నాయి.
కొత్త ఇన్‌చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. స్థానికంగా కమ్మ వర్గం, బీసీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైసీపీ తీసుకువచ్చిన ఈ ఈక్వేషన్ వర్కవుట్ కావడం కష్టమనేది పరిశీలకుల అంచనా. దీనికితోడు వైసీపీలో ఎవరికి వారుగా ఉన్న నాయకులు.. మల్లెలకు ఏమేరకు మేలు చేస్తారు. ఎలా కలిసి వస్తారు? ప్రచారం ఏం చేస్తారు? అనే విషయాలు కూడా.. చర్చకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది.
ప్రస్తుతం మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చినా.. ఆయనకు మం త్రి పదవి ఇస్తామన్న హామీని ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేయలేదు. దీంతో ఆయన ఆవేదనలోనే ఉన్నారు. సో.. ఆయన కలసి వచ్చే అవకాశం లేదు. గతంలో రజనీకి సపోర్ట్ చేసిన కొందరు కీలక నేతలు కూడా ఇప్పుడు సైలెన్స్ పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లెలకు సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుండడం గమనార్హం. ఇది పుల్లారావుకు గెలుపును గోల్డెన్ ప్లేట్‌లో పెట్టి అందిస్తుందని అంటున్నారు.