బీఆర్ఎస్ లో కీలకనేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తన కుటుంబంతో కలిసి పట్నం గురువారం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరటానికి మాజీమంత్రి కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం. ముందుగా అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పట్నం దంపతులు ముఖ్యమంత్రిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో పట్నం కుటుంబానికి మంచిపట్టుంది. అలాంటి పట్నం తొందరలోనే కాంగ్రెస్ లో చేరతుండటంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే టాక్ పెరిగిపోతోంది.
తాండూరు నుండి పట్నంపై 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన కెప్టెన్ రోహిత్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటినుండి పట్నంను కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో చాలాకాలం పట్నం డార్క్ లోనే ఉండిపోయారు. అలాంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా పట్నంను కేసీయార్ మంత్రిని చేశారు. ఎందుకంటే పట్నం సహకారం లేకపోతే పార్టీ గెలవదని అర్ధమైంది కాబట్టే. అయితే పట్నం మంత్రిగా చేరినా పార్టీ అన్ని చోట్ల ఓడిపోయింది.
అప్పటినుండి పట్నం జోరు తగ్గించేశారు. అలాంటిది ఇపుడు సడెన్ గా రేవంత్ ను కలవటంతో అందరి దృష్టి మాజీమంత్రిపై పడింది. మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సునీతకు చెవెళ్ళ ఎంపీ టికెట్ హామీ దక్కినట్లుగా ప్రచారం మొదలైంది. ఎంపీ టికెట్ ఇస్తామని పట్నం దంపతులకు కాంగ్రెస్ నుండి హామీ వచ్చింది కాబట్టే కాంగ్రెస్ లో చేరినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈనెల 11వ తేదీన పట్నం దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. అంటే పట్నం సునీతారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతే వీళ్ళని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీద పట్నం తమ్ముడు రెండుసార్లు పోటీచేశారు. అవన్నీ మరచిపోయి ఇపుడు అదే పట్నం దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించేదే అనటంలో సందేహంలేదు. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.