ఒకే జిల్లాలో నాలుగు సీట్లు.. జ‌న‌సేన డిమాండ్ బాగుందే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్ల పంప‌కాల విష‌యంపై ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ఏకంగా.. నాలుగు స్థానాల‌ను జ‌న‌సేన కోరుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి ఎటూ తేల్చ‌లేక‌.. ఇరు పార్టీలూ వాయిదాల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని అంటున్నారు.

జ‌న‌సేన కోరుతున్న వాటిలో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టికాగా, రెండోది పెడ‌న‌, మూడు కైక‌లూరు, నాలుగు అవ‌నిగ‌డ్డ ఉన్నాయ‌ని తెలిసింది. వీటిలో విజ‌య‌వాడ ప‌శ్చిమ టీడీపీ ఇచ్చే అవ‌కాశం దాదాపు ఉంది. కానీ, మిగిలిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి త‌ర్జ‌న భ‌ర్జ‌న‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ద‌రిమిలా.. ఇక్క‌డ సునాయాసంగా గెలుస్తామ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తోంది.

బ‌లాబ‌లాలు ఇవీ..

పెడ‌న‌: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కుమారుడి కోసం పెడన సీటును జనసేన నేతలు కోరుతున్నారు. మరోవైపు ఇదే అసెంబ్లీ సీటును మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ ఆశిస్తున్నారు. ఇప్పటికే కాగిత కృష్ణప్రసాద్ తన ప్రచార కార్యక్రమాల్లో పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ…స్టిక్కర్లు వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు.

అవ‌నిగ‌డ్డ‌: ఇది టీడీపీ వ‌దులుకోలేని టికెట్‌. మాజీ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ఇక్క‌డ‌నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌నసేన ఈ టికెట్‌ను ఆశిస్తోంది. జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీనివాస్ ఇప్పటికే పవన్ కల్యాణ్ ను కూడా కలిశారని, ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌: టీడీపీ నుంచి జ‌లీల్‌ఖాన్‌, నాగుల్ మీరా, బుద్దా వెంక‌న్న‌లు టికెట్ ఆశిస్తున్నారు. కానీ, ఇక్క‌డ జ‌న‌సేనకే మొగ్గు ఎక్కువ‌గా ఉంది. ఈ పార్టీ నాయ‌కుడు పోతిన మ‌హేష్ ఇక్క‌డ యాక్టివ్‌గా ఉండ‌డంతో ఆయ‌నకే టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారంలో ఉంది.

కైక‌లూరు: ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌.. వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో జ‌న‌సేన త‌ర‌ఫున మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు కామినేని శ్రీనివాస్ టికెట్ కోరుతున్నారు. దీనిని కేటాయించే అవ‌కాశం ఉంది.