టీడీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఒక విధ‌మైన టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక విధ‌మైన ప‌రిస్థితి ఉండ‌గా.. ఇప్పుడు చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ పెట్టుకోవ‌డంతో ఈ టెన్ష‌న్ మ‌రింత పెరిగింది. దీనికి కార‌ణం.. టికెట్లు వ‌స్తాయో..రావోన‌నే బెంగే నాయ‌కుల‌ను ప‌ట్టుకోవ‌డం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు క్లారిటీ వ‌చ్చింది. దీంతో 20 నుంచి 30 అసెంబ్లీ, 2 నుంచి 3 పార్ల‌మెంటుస్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ దీనిపై స్ప‌ష్ట‌త పూర్తిగా రాలేదు. ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాలు త‌ప్పితే.. పార్టీ ప‌రంగా ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఆయా స్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన నాయ‌కులు, చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ఖ‌ర్చులు చేసిన నాయ‌కులు బెంగ పెట్టుకున్నారు. త‌మ‌కు టికెట్ ఇస్తారో.. ఇవ్వ‌రో అంటూ.. ఆరాలు తీయ‌డం ప్రారంభించారు. ఇక‌, ఇప్పుడు కొత్త‌గా చంద్ర‌బాబు బీజేపీ పొత్తుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న నేరుగా ఢిల్లీకి వెళ్లారు. పొత్తుల కోసమే ఆయ‌న ఢిల్లీ బాట ప‌ట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో త‌మ్ముళ్ల‌లో మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మ‌రో 6 నుంచి 8 అసెంబ్లీ, 1 నుంచి 2 పార్ల‌మెంటు స్థానాల‌ను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఇది కూడా ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత వ‌చ్చి చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. త‌న‌కు సీటు ఇస్తున్నారో.. లేదో తేల్చి చెప్పాల‌ని కూర్చున్నారు. ఆయ‌నే పెడన టీడీపీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్. పొత్తులో భాగంగాఈ సీటుకూడా జనసేనకు పోతుందనే అనుమానం టీడీపీ నేతలను టెన్షన్‌కు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న త‌న అనుచ‌రుల‌ను వెంటేసుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వ‌చ్చి.. ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని కోరారు.దీనిపై చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. టికెట్‌పై చంద్రబాబు హామీ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెడ‌న ఎటూ పోద‌ని.. నువ్వు రెడీ చేసుకోమ‌ని చంద్ర‌బాబు అభ‌యం ఇవ్వ‌డంతో కాగిత ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు సార్లు భేటీ అయిన త‌ర్వాత‌.. కాపులు ఎక్కువ‌గా ఉన్న పెడన టికెట్ తమ నాయ‌కుడికి ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కృష్ణప్రసాద్ వ‌ర్గంలో అల‌జ‌డి రేగింది. గ‌త నాలుగేళ్లుగా ఇక్క‌డ కార్య‌క్ర‌మాలుచేస్తున్నాం.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాం.. ఇప్పుడు టికెట్ ఇవ్వ‌రా ? అంటూ.. వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. మొత్తానికి చంద్ర‌బాబు దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ, రాష్ట్రంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.