‘దొరికితే దొంగ.. దొరకనంత వరకు దొర’ అని ఒక సామెత. నూతన్ నాయుడి వ్యవహారం ఇన్నాళ్లూ దొరలాగే సాగింది. అతడి వక్ర బుద్ధి కొత్తదేం కాదు. ఎప్పట్నుంచో అన్యాయలు, అక్రమాలు చేస్తున్నాడు. కానీ ఇన్నాళ్లూ అవేవీ బయటపడలేదు. ఇప్పుడు దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్ నాయుడి మీదికి అందరి దృష్టి మళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
ఇంతకుముందు నూతన్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్లందరూ ఇప్పుడు గళం విప్పుతున్నారు. రచయిత, సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మాణ వ్యవహారాలు చూసే వెంకట్ శిధారెడ్డి పెట్టిన ఫేస్ బుక్ పోస్టు నూతన్ బాగోతాన్నంతా బయట పెట్టింది. అలాగే మాజీ ఐఏఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ సైతం తన పేరు వాడుకుని నూతన్ చేసిన మోసాల గురించి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నూతన్ నాయుడి వ్యవహారాల్ని లోతుగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అతడి అక్రమాలు, అన్యాయాలకు సంబంధించి విశాఖపట్నం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎనిమిది కేసులు నమోదు కావడం గమనార్హం. ఒక మొబైల్ నంబర్ ద్వారా పీవీ రమేష్ పేరు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది అధికారులతో మాట్లాడి వివిధ రకాల పనులు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే నూతన్ మీద ఎనిమిది కేసులు నమోదవగా.. అతడి బాధితులు మరింత మంది వస్తున్న నేపథ్యంలో మరిన్ని కేసులు తప్పకపోవచ్చు. ఈ క్రమంలో అతడిపై రౌడీషీట్ తెరవాలని పోలీసులు యోచిస్తున్నటలు తెలుస్తోంది.
మరోవైపు శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్యతో పాటు ఐదుగురిని కస్టడీలోకి తీసుకునేందుకు విశాఖ పోలీసులు కోర్టు అనుమతి కోరారు. వారికి అనుమతి మంజూరయ్యే అవకాశముంది. మొత్తానికి శిరోముండనం కేసు పుణ్యమా అని నూతన్ నాయుడి వ్యవహారాలన్నీ బయటికొచ్చి అతను బాగానే ఇరుక్కున్నట్లు స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates