రాజకీయాల్లో జంపింగులు కామన్‌గా మారిపోయాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితిగా మారింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌కు, ఈ రెండు పార్టీల నుంచి బీజేపీకి ఇలా.. నామినేషన్లు దాఖలు చేసే రోజు వరకు కూడా జంప్ జిలానీల సందడి కనిపిస్తూనే ఉంది. ఇక, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు కూడా.. ఇదే తరహా జంపింగులు తెరమీదికి వచ్చాయి.
2019 పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మార్పు అనూహ్యంగా జరిగింది. ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా ఆయన పార్టీ మారిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో రేవంత్ ను కలిసిన వెంకటేష్ అననూహ్యంగా కండువా మార్చేసుకున్నారు.
ఆయన వెంట అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. కీలకమైన ఎన్నికలకు ముందు ఇలా వెంకటేష్ పార్టీ మార్పు బీఆర్ ఎస్‌లో చర్చనీయాంశం అయింది. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల కిందటే ఎంపీలతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేయాలని.. గెలుచుకోవాలని.. కాంగ్రెస్‌ను నమ్మొద్దని సూచించారు. ఇది జరిగిన రెండు రోజులకే కీలకమైన పెద్దపల్లి స్థానం నుంచి జంప్ జరగడం.. పార్టీలోనూ విస్మయ వాతావరణం కనిపించింది.
టికెట్ రాదన్నదే..
వెంకటేష్ పార్టీ మార్పునకు కారణం.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ టికెట్ ఇవ్వబోదన్న ప్రచారమేనని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో వెంకటేష్ స్థానంలో ఈ సారి అంతకన్నా బలమైన అభ్యర్తిని దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు స్థానికంగా వార్తలు హల్చల్ చేశాయి. దీనికితోడు ఎంపీ వెంకటేష్‌కు బీఆర్ ఎస్ నాయకత్వానికి గ్యాప్ ఏర్పడింది.ఈ పరిణామాలతోపాటు.. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి, రేవంత్ జోరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ గూడు అయితే సేఫ్ అని అనుకుని ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు.