వచ్చే పార్లమెంటు ఎన్నికలే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చేముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మరో రెండు గ్యారెంటీలను ఆయన పచ్చ జెండా ఊపారు. తాజాగా జరిగిన కేబినెట్‌లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత ప్రభావం చూపించగల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీలకమైన నిర్ణయమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వరంలో జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేసమయంలో తెలంగాణ తల్లి
రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఇవీ.. కీలక నిర్ణయాలు
- పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
- అర్హులైన వారికి రూ.500 గ్యాస్ సిలిండర్ తక్షణ అమలు
- ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్పు
- తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
- తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర రాజముద్రలో మార్పు
- సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో
కొడంగల్
ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు - ఐటీఐ కాలేజీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్
- నూతన హై కోర్టుకు భూ కేటాయింపు
- వ్యవసాయ శాఖలోని ఖాళీల భర్తీ
- డిసెంబరు నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ