ఏపీలో కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. సభలు, సమావేశాలు.. ఎటు చూసినా.. సలసల కాగుతున్న రాజకీయాలే కళ్లకు కడుతున్నాయి. ఒకరు సిద్ధం సభలతో వేడి పుట్టిస్తే.. మరొకరు రా.. కదలిరా! అంటూ.. మరింత సెగలు పుట్టిస్తున్నారు. ఇక, ఇంకోవైపు.. జనసేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుంది. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కూడా యాత్రలకు రెడీ అవుతున్నారు.
ఇలా.. రాష్ట్రంలో రాజకీయ వేడి.. హాట్ హాట్‌గా కొనసాగుతున్న క్రమంలో మరో సెగ సోమవారం నుంచి మరింత రగులుకోనుంది. సోమవారం నుంచి ఏపీ అసెంబ్ల బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్నికలకు ముందు.. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఆఖరి బడ్జెట్ ఇదే. పైగా సమావేశాలు కూడా ఇవే కావడం గమనార్హం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇదిలావుంటే.. ఈ సమావేశాలను ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ముగించాలని అధికారపక్షం ప్రయత్నిస్తోంది.
అయితే. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం.. కనీసం 10 రోజలు అయినా.. సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇక, సమావేశాల్లో కేవలం బడ్జెటపైనే చర్చ కాకుండా.. తమకు ప్రత్యేక అంశాలు ఉన్నాయని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పోలవరం, దాడులు, పోలీసుల కేసులు ఇలా .. అనేక అంశాలను టీడీపీ ప్రస్తావిస్తోంది. మరోవైపు.. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారి విషయంలో మౌనంగా ఉండడాన్ని కూడా సభలో లేవనెత్తనున్నారు.
మొత్తంగా టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంది. అయితే.. పరిస్థితి ఎలా ఉన్నా.. తట్టుకుని ముందుకు సాగాలని.. వైసీపీ కూడా రెడీఅయింది. గత సభలో పూర్తిగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినట్టుగా ఈ దఫా కూడా అదే సూత్రాన్ని పాటించాలని భావిస్తోంది. దీంతో అసెంబ్లీ వేదికగా.. మాటల తూటాలు, సవాళ్లు మరింత పెరగనున్నాయి. పైగా ఎన్నికలకు ముందు కావడంతో ఈ వేడి మరింత రాజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.