జనసేన పార్టీ అధినేత, ఇతర నాయకులు కూడా తమ పార్టీ వాయిస్ పార్లమెంటులో ఉంటే బాగుంటుంది. మా నాయకుడు ఒక్కడైనా పార్లమెంటులో గళం వినిపిస్తే చూసి తరించాలని ఉంది అని ఆశ పడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. “మాకు ఒక్క ఎంపీ అభ్యర్థి ఉన్నా.. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ఉండే వాళ్లం. కానీ, లేరే. మీరు మాకు ఆరోజు ఒక్క ఎంపీని ఇచ్చి ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీ కరణపై పార్లమెంటులోనే నిలదీసి ఉండే వాళ్లం” అని పవన్ విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిర్వహించిన సభలో చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జనసేన తరఫున ఖచ్చితంగా ఒక అభ్యర్థి అయినా.. ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయనే తాజాగా పార్టీ కండువా కప్పుకొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలశౌరి.. తాజాగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ టికెట్ మారుస్తామని ప్రకటించడం.. ఆయన దానికి ససేమిరా అనడంతో వల్లభనేని బయటకు వచ్చారు ఇక, జనసేనలో ఇప్పటికే టికెట్ హామీ లభించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్నే ఎంచుకోనున్నారు. ఇక్కడ ఆయన గెలుపు తథ్యమనే వాద న బలంగా వినిపిస్తోంది. స్థానికంగా మచిలీపట్నం పోర్టు విస్తరణకు సంబంధించి పార్లమెంటులో అనేక సందర్భాల్లో నిలదీశారు. ఈ క్రమంలోనే కేంద్రం నిధులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. మత్స్యకారులకు అవసరమైన ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆయన కేంద్రం నుంచి సాధించారు. ఇది కూడా ఆయనకు ప్లస్‌గా మారనుంది. మరీ ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, విమర్శలు, అక్రమాల వంటి వాటికి బాలశౌరికడుదూరంగా ఉన్నారు. వీటన్నింటికీ తోడు సిట్టింగ్ ఎంపీ కావడం ఆయనకు కలిసి వస్తోంది.
వైసీపీ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం సీటు ఇచ్చారు. ఇది ప్రధాన మైనస్ అని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఆయనకు ఎమ్మెల్యే స్థాయి కన్నా ఎక్కువగా రాజకీయాలు చేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. అదేసమయంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయనపై వివాదాలు, అక్రమాల ఆరోపణలు, కేడర్ నుంచి అసంతృప్తి వంటివి కొండలుగా పేరుకున్నాయి. దీంతో సింహాద్రి వర్సెస్ బాలశౌరిని పరిశీలిస్తే.. బాలశౌరి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు పరిశీలకులు.