తూర్పుపై `శెట్టిబ‌లిజ` ప‌ట్టు.. వైసీపీ ఎన్నికల వ్యూహం

బీసీల్లో ఒక వ‌ర్గంగా ఉన్న `శెట్టిబ‌లిజ`  సామాజిక వ‌ర్గం.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో బ‌లంగా ఉంది. ముఖ్యంగా తూ ర్పు గోదావ‌రి జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 8 నుంచి 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉన్నా రు. అందుకే వీరి విష‌యంలో అన్ని పార్టీలూ జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తాయి. గ‌తంలో కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు.. ఈ వ‌ర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చింది. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక‌.. ఈ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డ మే లక్ష్యంగా అడుగులు వేశార‌ని చెప్పుకొనే వారు.

ఇప్పుడు వైసీపీలోనూ శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోసులుఈ సామాజిక వ‌ర్గ‌మే. ఇక‌, ఇప్పుడు మ‌రింత‌గా ఈ వర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా.. తూర్పులో కీల‌క‌మైన రాజ‌మండ్రి ఎంపీ స్థానాన్ని శెట్టిబ‌లిజ‌కు కేటాయించింది. ఇలా.. రాజ‌మండ్రి ఎంపీ సీటును బీసీ వ‌ర్గంలో ఒక‌టిగా ఉన్న శెట్టి బ‌లిజ‌కు రాజ‌మండ్రి సీటు ఇవ్వ‌డం ఇదే తొలిసారి. గ‌తంలో రెడ్లు, త‌ర్వాత బ్రాహ్మ‌ణులు, త‌ర్వాత క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఇక్క‌డ ఎంపీ అబ్య‌ర్థులుగా ఉన్నారు. పార్టీ ఏదైనా వారికే టికెట్‌లు ద‌క్కాయి.

ఇప్పుడు.. వైసీపీ శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేసింది. రాజ‌మండ్రి వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గానికి డాక్ట‌ర్ గూడూరి శ్రీనివాస్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.  గూడూరి శ్రీనివాస్‌ శెట్టిబలిజ(బీసీ) సామాజిక వర్గానికి చెందినవారు. పల్మనాలజిస్ట్‌ అయిన గూడూరి.. ప్ర‌స్తుత రాజ‌మండ్రి ఎంపీ భరత్‌ సమక్షంలో గతేడాది పార్టీలోకి చేరారు. కాగా, ఇటు న‌గ‌రంలోనూ.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డాక్ట‌ర్ గూడూరుకి మంచి ప‌ట్టుంది. పైగా సొంత సామాజిక వ‌ర్గంలో మేధావుల స‌భ‌ల‌కు.. ఆయ‌న హాజ‌రువుతూ ఉంటారు. వివాద ర‌హితులుగా గుర్తింపు పొందారు. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన టీడీపీ కంచుకోట‌లో మ‌రోసారి పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా చేసిన ప్ర‌యోగంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.