రాజ‌య్య రూటు మారుతోంది.. రేవంత్ దిశ‌గా అడుగులు

తెలంగాణ రాజ‌కీయాల్లో ..ముఖ్యంగా వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో వివాదాస్ప‌ద నాయ‌కుడిగా, మంత్రిగా , నిత్యం మీడియాలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజ‌య్య‌.. తాజాగా మ‌రో సారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని రాజ‌య్య‌..అప్ప‌ట్లో బీఆర్ ఎస్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. పార్టీ అదినేత ఏం చెప్పినా.. చేస్తాన‌ని, మ‌ళ్లీ అధికారం బీఆర్ ఎస్ దేన‌ని అన్నారు. కానీ, ఎన్నిక‌లు జ‌రిగి ప‌ట్టుమ‌ని మూడు మాసాలు కూడా కాక‌ముందే మాట మార్చేశారు.

బీఆర్ ఎస్ పార్టీ త‌న‌ను మాన‌సిక క్షోభ‌కు గురి చేసింద‌ని చాలా పెద్ద పెద్ద మాట‌లే అనేశారు. కానీ, వాస్త‌వానికి రాజయ్యకు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఈ బీఆర్ ఎస్ పార్టీనే ఇచ్చింది. కానీ, ఆయ‌న త‌న తుంట‌రి చేష్ట‌ల‌తో వివాదాస్ప‌ద‌మై.. స‌ద‌రు ప‌ద‌విని పోగొట్టుకున్నారు. త‌ర్వాత‌.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయినా.. ఆయ‌న తుంట‌రి చేష్ట‌లు మానుకోలేద‌ని.. స్వ‌యంగా మీడియా ముందుకు సొంత పార్టీ నాయ‌కురాలే వ‌చ్చి ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అడుగ‌డుగునా సెగ పెరిగింది.

ఇదంతా మ‌రిచిపోయిన రాజ‌య్య తాజాగా బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ.. దీనికి ముందు కూడా.. త‌న‌ను బీఆర్ ఎస్ పార్టీ మాన‌సిక క్షోభ‌కు గురి చేసింద‌న్నారు. పార్టీ విధానాలు కూడాత‌న‌కు న‌చ్చ‌డం లేద‌న్నారు. పార్టీ అధినాయ‌కుల‌ను క‌లుసుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌న్నారు. పార్టీ అస‌లు త‌న‌కు స‌రైన గుర్తింపే ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. దీంతో పార్టీలో కేడ‌ర్ నుంచి త‌న‌కు ఒత్తిడి పెరిగిపోయింద‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా రాజయ్య‌.. త‌న మ‌న‌సులో మాట‌లు చెప్పేశారు.

క‌ట్ చేస్తే.. రాజయ్య రాజ‌కీయ వ్యూహం వేరేగా ఉంది. ఆయ‌న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీలో చేరి.. పార్టీకి సేవ చేసి.. త‌ద్వారా ఎమ్మెల్సీ సీటు సంపాయించాల‌నేది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అందుకే.. నిన్నటి వ‌ర‌కు బెల్ల‌మైన బీఆర్ ఎస్‌.. ఇప్పుడు ఆయ‌న‌కు అల్లంగా క‌నిపిస్తోందని అంటున్నారు.