ఏపీసీఎం జగన్‌పై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. జగన్ ఎన్నితప్పులు చేయకూడదో అన్నీ చేశారని అన్నారు. “సీఎం పదవి పోతే.. జగన్‌కు ఎంత బాధ ఉంటుందో.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పదవి పోతే.. వారికి కూడా అంతే బాధ ఉంటుంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరాభవమే వచ్చే ఎన్నికల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు“ అని అన్నారు.
తాజాగా రాజమండ్రిలో ఉండవల్లి మీడియతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జగనే పోటీ చేస్తున్నారని సెటైర్ వేశారు. ఎందుకంటే.. ఎమ్మెల్యేల పాత్ర ఏమీ లేకుండా పోయిందని, అంతా సీఎం జగన్, వలంటీర్ల చేతుల్లోనే పాలన సాగిందన్నారు. అర్బన్ ఏరియాల్లో జగన్ వ్యతిరేక ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి అన్నారు. అయితే, గ్రామీణ స్థాయిలో పింఛన్లు, ఇతరత్రా కార్యక్రమాలను ఇంటికే చేరవేస్తుండడంతో ఆ ప్రభావం వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో జగన్‌కు వ్యతిరేకం కావొచ్చన్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పాజిటివ్ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పారు. గత ఎన్నికలలో జనసేనకు 6% ఓట్లు వచ్చాయని, ఈ సారి పెరుగుతుందన్నారు. వాస్తవంగా జనసేన, టీడీపీ కలిశాయంటే ప్రభుత్వంలో కొంత ఒత్తిడి పెరిగి షేక్ రావాల్సి వచ్చేదని, కానీ, అలాంటి పరిస్థితి వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates