ఇచ్చిన హామీలేమ‌య్యాయి స‌ర్‌:  మోడీపై ష‌ర్మిల  ఫైర్‌

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఢిల్లీలో దీక్ష‌కు దిగారు. తొలుత నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఆమె ఒంటికాలిపై విరుచుకుపడ్డారు. “ఏపీకి ఇచ్చిన హామీలేమ‌య్యాయి.. మోడీ స‌ర్‌“ అంటూ.. నిప్పులు చెరిగారు. ఏపీ కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌లిసి రెండు రోజుల కింద‌టే ఢిల్లీకి  చేరుకున్న ష‌ర్మిల అక్క‌డి ఏపీ భ‌వ‌న్‌లోనే కార్య‌క్ర‌మానికి రెడీ అయ్యారు. అయితే.. తొలుత ఆమె కార్య‌క్ర‌మానికి పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర‌స్థాయిలో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంత‌రం.. ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి..త‌న నిర‌స‌న‌ను కొన‌సాగించారు. తొలుత ఏపీ భ‌వ‌న్‌లోని అంబేడ్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.

అనంత‌రం దీక్ష‌లో కూర్చున్న ష‌ర్మిల‌.. మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీకి అనేక హామీలు ఇచ్చిన వారిలో మీరూ ఉన్నార‌ని.. 2014లో ఎన్నిక‌ల‌కు ముందు మీరు ఏపీలోనూ ప్ర‌చారం చేశార‌ని..ఈ సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయి? అని నిల‌దీశారు. “అన్ని దొంగ మాట‌లు.. దొంగ హామీలు“ అంటూ తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

హోదాపై..

ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని.. మోడీ చెప్పారు. ఏపీని స్వర్ణాంధ్ర చేస్తాన‌న్నారు. పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి’’ అని ప్రశ్నించారు. చట్టప్ర కారం కల్పించిన హక్కు ప్రత్యేక హోదా అని తెలిపారు.అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈఊసే మ‌రిచిపోయార‌ని విమ‌ర్శ‌లుగుప్పించారు.

రాజ‌ధాని.. ఇత‌ర హామీలు..

ఏపీ రాజ‌ధాని స‌హా ఇత‌ర హామీల‌పైనా ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. “కొత్త రాజ‌ధానిని నిర్మించి ఇస్తామ‌ని.. చ‌ట్టంలో చేర్చారు. కానీ, పేద‌ళ్ల‌యినా ఈ హామీ ని మీరు పూర్తి చేయ‌లేదు. క‌నీసం.. రాజ‌ధాని గురించి ఏనాడైనా చింతించారా?“ అని అన్నారు. ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ కూడా.. ఇప్పుడు కాలాతీతం అయిపోయింద‌న్నారు. ఏపీకిరాజ‌ధాని లేదంటే.. అది మీరు చేసిన పనేన‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.  

+ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారని.. ఆ విష‌యాన్ని కూడా అట‌కెక్కించార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఓడ‌రేవులు, నౌకాశ్ర‌యాల‌ నిర్మాణం మ‌రిచిపోయార‌న్నారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడి జిల్లాలకు ఇచ్చిన ప్యాకేజీలు ఏమయ్యాయని ప్ర‌శ్నించారు.  చివరికి ఆంధ్రుల హ‌క్కుగా ఉన్న‌విశాఖ స్టీల్ ప్లాంటును కూడా ప్ర‌వేటీక‌రించేందుకు ప‌న్నాగం ప‌న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక్క ఎంపీ సీటు లేకపోయినా ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు.