అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..

తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం ప్రారంభించేశారు. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని 17 స్థానాల్లో క‌నీసం 14 నుంచి 16 స్థానాల‌ను త‌మ కైవ‌సం చేసుకోవాల‌ని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇంద‌వ‌ల్లి వేదిక‌గా .. నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ద్వారా ప్ర‌చార శంఖం పూరించారు. ఈ సభ‌కువేల సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లి వ‌చ్చారు. పార్టీ శ్రేణులు… కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డంతో సీఎం రేవంత్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గ‌త ఎన్నిక‌ల్లో 4 స్థానాల్లో మాత్ర‌మే పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సంఖ్య‌ను 16కు పెంచుకోవ‌డంపై రేవంత్ కొన్నాళ్లుగా త‌పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ విధంగా అయితే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకున్నారో.. అదేవిధంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌నేది ఆయ‌న వ్యూహం . ప్ర‌ధానంగా రాహుల్ గాంధీని ప్ర‌ధాని పీఠం ఎక్కించాల‌న్న‌ది ఆయ‌న వ్యూహం. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందే ఇంద్ర‌వల్లి వేదిక‌గా.. స‌భ‌ను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని, త‌ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌న్న సంకేతాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అనుకున్న విధంగానే ఇంద్ర‌వ‌ల్లి స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. కొంద‌రు స్వ‌చ్ఛందంగానే వ‌చ్చారు. ఎటు చూసిన ప్ర‌జ‌ల‌తో స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. వాహ‌నాల‌తో ర‌హ‌దారులు కిక్కిరిశాయి. ‘అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..’ స‌త్తా.. అనే నినాదంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వ‌ల్లిలో నిర్వ‌హించిన ఈ స‌భ‌కు.. సీఎం రేవంత్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తూ.. ఇంద్ర‌వ‌ల్లిని ఎన్నుకోవ‌డం వెనుక విశేషం ఉంది. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేసిన ఆదిబాద్ గ‌డ్డ ఇదే కావ‌డం.. ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామని సీఎం రేవంత్ ప‌దే ప‌దే చెబుతుండ‌డంతో ఇంద్ర‌వ‌ల్లి ప్రాంతాన్ని స‌భ‌కు వేదిక‌గా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌భ విజ‌యంతో పార్టీని మ‌రో రేంజ్‌కు తీసుకువెళ్లాల‌నేది సీఎం రేవంత్ ప్ర‌య‌త్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.