“నీ అయ్య.. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది“ అంటూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఎవడైనా ఆ మాటలు అంటే.. ప్రజలే తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ప్రదాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు తరచుగా రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా.. దాదాపు ఇదే వ్యాఖ్యలు చేశారు. “వాళ్ల ప్రభుత్వాన్ని వాళ్లు ఎన్నాళ్లు కాపాడుకుంటారో చూద్దాం“ అని పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఫైరయ్యారు. “నీ అయ్య..ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేంది. ఎవడ్రా కొట్టేది. మీ ఊళ్లో ఎవడన్నా.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చూస్తే.. వేప చెట్టుకు కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి“ అని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజలు తమను ఆదరించారని.. గుండెల్లో పెట్టుకున్నారని..ప్రజల మాండేట్‌కు విరుద్ధంగా కొందరు గుంటనక్కలు ఇలా కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపైనా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలాంటివారిని తరిమి కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు.
“మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. ఏదేదో అంటున్నారు. అలాంటి వారు ఊర్లల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పండి“ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 2012కు ముందు చెప్పిన మాట ప్రకారం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఆ కృతజ్ఞతతోనే పదేళ్ల ఆలస్యం అయినా కూడా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఇప్పుడు అధికారం అప్పగించారని చెప్పారు. అలాంటి ప్రజల మాండేట్‌ను కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates