ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల నోటిఫికేషన్ లేదా షెడ్యూల్‌కు రెండు మాసాల ముందుగానే అభ్యర్థులను దాదాపు నియమిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐదు జాబితాలు ఇవ్వగా తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలకు కలిపి 10 మంది సమన్వయ కర్తలను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జునలు ఆరో జాబితాను విడుదల చేశారు.
ఇదీ.. ఆరో జాబితా!
రాజమండ్రి ఎంపీ స్థానం – గూడూరి శ్రీనివాస్,
నరసాపురం ఎంపీ స్థానం- గూడూరి ఉమాబాల
గుంటూరు ఎంపీ స్థానం – ఉమ్మారెడ్డి రమణ
చిత్తూరు ఎంపీ(ఎస్సీ) – రెడ్డప్ప
గిద్దలూరు ఎమ్మెల్యే- నాగార్జున రెడ్డి
నెల్లూరు సిటీ- ఎండీ ఖలీల్
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే(ఎస్సీ) – కె.నారాయణ స్వామి,
ఎమ్మిగనూరు- బుట్టా రేణుక
మైలవరం – తిరుపతిరావు,
మార్కాపురం – రాంబాబులను సమన్వయ కర్తలుగా నియమించారు.
ఈ ప్రశ్నకు సమాధానమేదీ?
సమన్వయ కర్తలుగా నియమిస్తున్నవారి విషయంలో పార్టీ అధిష్టానం తడబడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీల కులు. వాస్తవానికి ఒక్కసారి జగన్ నిర్ణయం తీసుకుంటే ఇక, వెనక్కి తీసుకోరని ఆపార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. దీంతో సమన్వయ కర్తలుగా నియమితులైన వారు వారి పనిని వారు చేసుకుని పోతున్నారు. కొందరు నచ్చనివారు.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే.. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలోనూ.. ఇప్పుడు విడుదల చేసిన ఆరో జాబితాలోనూ.. అభ్యర్థుల మార్పు స్పష్టంగా కనిపించింది.
గత జాబితాలో తిరుపతి ఎంపీగా నియమించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వద్దని వెళ్లిపోయారు. దీంతో ఆ స్థానానికి వేరే వారిని నియమిస్తారని అందరూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ఎమ్మెల్యే స్థానానికి పంపించిన ఎంపీ గురుమూర్తిని తీసుకువచ్చి మళ్లీ తిరుపతికి కేటాయించారు. ఇక, ఇప్పుడు ఇచ్చిన జాబితాలోనూ ఇలాంటి మార్పే కనిపించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను అసెంబ్లీకి పంపించారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు.కానీ, తాజా జాబితాలో వీరిని తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చారు. మరి ఇదేం మార్పు ? అనేది వైసీపీనాయకుల ప్రశ్న. దీనిపై అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది.