కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మడి కృష్నాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా.. సంక్షేమం ఒక్కటే చాలదు.. ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేతకావడం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చర్చగా మారాయి. ఈ నేపథ్యానికి తోడు.. శనివారం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సిద్ధం
బహిరంగ సభకు ఎమ్మెల్యే వసంత సహాయ నిరాకరణ ప్రకటించారు. తాను వచ్చేది లేదన్నారు. తన తరపున కూడా ఎవరూ రానన్నారు.
దీంతో ఎమ్మెల్యే వసంత అంతరంగాన్ని అంచనా వేసిన సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆయనకు లైన్ క్లియర్ చేశారు. నీ ఇష్టం.. నీ దారి నువ్వు చూసుకోవచ్చు
అన్నట్టుగా మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వసంతను తప్పించే శారు. ఈ స్థానంలో మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు తిరుపతి రావు పేరును సీఎం ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఈయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఫలితంగా వసంత ఇక, తన దారి తాను చూసుకునేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పుడు ఎవరు?
ఇక, వసంత కృష్ణ ప్రసాద్.. వైసీపీని వీడితే.. ఆ స్తానంలో ఎవరు పోటీ చేయనున్నారనే చర్చ కూడా వైసీపీలో వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్తగా ఉన్న దేవినేని అవినాష్‌ను ఇక్కడ కు పంపించనున్నారని తెలుస్తోంది. ఆయన దీనికి ఒప్పుకొంటారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గంలో దేవినేని కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ప్రజలను కలిశారు. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆయన ఈ నియోజకవర్గం వదులుకునే అవకాశం లేదు.
ఒకవేళదేవినేని అవినాష్ తూర్పును వదులుకునేందుకురెడీగా లేకపోతే..ఈ సీటును ఆశిస్తున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా చౌదరిని నేరుగా మైలవరం నుంచి దింపే అవకాశం ఉందని అంటున్నారు. మైలవరంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం.. వారే గత ఎన్నికల్లో ఇక్కడ వసంతకు అండగా ఉండడం గమనార్హం. ఇప్పుడు కేశినేని నాని వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయగలిగితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీయేనని పార్టీ కూడా అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే వసంత విషయంపై ముందుగానే ఉప్పందినా.. వేచి చూసి.. చివరకు ఆయన ధోరణిని తీవ్రంగా పరిగణించి.. తాజాగా మార్పు దిశగా అడుగులు వేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.