వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే, మోడీ ధీమా వెనుక‌ ఏముంది?

పార్ల‌మెంటు బ‌డ్జెట్ ప్ర‌సంగం మొత్తం 56 నిమిషాలు సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఏక‌బిగిన ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఈ మొత్తం 56 నిమిషాల ప్ర‌సంగంలో మూడు సార్లు.. ఆమె వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే అని ఉద్ఘాటించారు. ఇక‌, బ‌డ్జెట్ అయిపోయి.. దానిపై తాజాగా స్పందించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా.. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌తో మోడీకానీ, నిర్మ‌ల‌మ్మ కానీ.. ఇంత ధైర్యంగా.. ఇంత విశ్వాసంతో వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ మేన‌ని ఎలా చెప్ప‌గ‌లుగుతున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఈ విష‌యానికి సంబంధించి చూస్తే.. ప్ర‌త్యామ్నాయ‌ నాయ‌కుడిని ఎంచుకుని.. మోడీ వంటి బ‌ల‌మైన బీసీ నేత‌ను ఎదుర్కొన డంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌నేది వాస్త‌వం. మోడీని బ‌లంగా ఢీ కొట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ.. ఆదిశ‌గా ఏర్పాటు చేసిన ఇండియా కూట‌మిని స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపించ‌లేక పోయారు. దీనిలోనూ అనేక లుక‌లుక‌లు ఎలుగెత్తిన ద‌రిమిలా.. ఇప్పుడు ఇండియా కూట‌మి అంటే.. కాంగ్రెస్ మాత్ర‌మే క‌నిపిస్తున్న ప‌రిస్థితి ఎదురైంది. దీనిని సాధించ‌డంలో అంటే.. కాంగ్రెస్‌ను ఒంట‌రిని చేయ‌డంలో తెర‌చాటున మోడీ మిత్ర‌ప‌క్షాల‌ వ్యూహం స‌క్సెస్‌గా సాగిపోయింది. అందుకే.. మాదే అని మ‌ళ్లీ చెప్ప‌గ‌లుగుతున్నార‌న‌డంలో సందేహం లేదు.

ఇక‌, ఓటు బ్యాంకు ప‌రంగా.. చూస్తే.. క్షేత్ర‌స్థాయిలో తీసుకువెళ్తున్న విక‌సిత భార‌త్ సంకల్ప యాత్ర‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌ద్వారా క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌కు మాత్ర‌మే ద‌ఖ‌లు ప‌డుతూ వ‌చ్చిన ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకోవడంలో మోడీ ధ్వ‌యం స‌క్సెస్ అవుతోంది. మ‌రోవైపు.. రాష్ట్రాల్లో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలోనూ మోడీ ద్వ‌యం ముందుకు వ‌డివ‌డిగా సాగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపీ బ‌ల‌ప‌డ‌క‌పోయినా.. బ‌ల‌పడే పార్టీల బ‌లమంతా న‌రేంద్ర‌మోడీకే జై కొట్ట‌నుంది.

ఎలా చూసుకున్నా.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా బ‌ల‌మైన నాయ‌కుడు అంటే.. మోడీ, మోడీ అంటే బ‌ల‌మైన నాయ‌కుడిగానే ప్ర‌తిబింబిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్య‌మే అంత దీటుగా.. అంత బ‌లంగా.. `మేమే మ‌ళ్లీ వ‌స్తాం“ అని చెప్ప‌డానికి కార‌ణంగా నిలుస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా.. ప్ర‌స్తుత ప‌రిస్థితిని మార్చేందుకు, త‌మ బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ మ‌రింత ప్ర‌య‌త్నిస్తే.. త‌ప్ప సాధ్యం కాద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.