ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు జాబితాలు ప్రకటించింది. వీటిలో కొందరికి స్థానచలనం కల్పించడంతోపాటు.. మరికొందరు కొత్త ముఖాలకు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్రకటించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మూడు అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కర్తలను నియమించింది. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
1) నరసరావుపేట ఎంపీ సీటును బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చారు. ఈయన ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుస విజయాలతో ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.
2) కాకినాడ పార్లమెంటు స్థానాన్ని చెలమల శెట్టి సునీల్‌కు ఇచ్చారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలోనూ.. ప్రస్తుతం ఆయన వివాదరహిత నాయకుడిగా సామాజిక వర్గంలో మంచి గుర్తింపు పొందారు. వ్యాపార వేత్త. ఆర్థికంగా బలంగా ఉన్నారు.
3) తిరుపతి పార్లమెంటు స్థానానికి ప్రస్తుత ఎంపీ. గురుమూర్తినే డిసైడ్ చేశారు. ఈయన వైద్యుడు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి ఈయనను నాలుగో జాబితాలో అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. కానీ, తిరుపతి పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసిన కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరేందుకు ప్రయత్నించడంతో గురుమూర్తి ప్లేస్‌ను తిరిగి ఆయనకే ఇచ్చారు. ఈయన కూడా వివాద రహితుడు. విద్యావంతుడు.
4) మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సింహాద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు. ఈయన మాజీ ఎమ్మెల్యే. అవనిగడ్డ నుంచి గతంలో కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్నారు. ఈయన వివాదాలకు దూరంగా ఉంటారు.
5) సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌కు అవకాశం ఇచ్చారు. ఈయన కొత్తవారు.
6) అరకు ఎమ్మెల్యేగా రేగం మత్య్సలింగంకు అవకాశం కల్పించారు. ఈయన కూడా కొత్తవారే. పైగా ఇది ఎస్టీ నియోజకవర్గం కావడం గమనార్హం.
7) అవనిగడ్డ ఎమ్మెల్యే సీటును సింహాద్రి చంద్రశేఖరరావుకు ఇచ్చారు. మొత్తంగా.. మూడు అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.