టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై ఆయన దృష్టిపెట్టారు. ఈ క్రమంలో జనసేన కీలక నేతలతోనూ ఆయన కలపుకొని పోతున్నారు. తాజాగా మంగళవారం నుంచి గురువారం వరకు అంటే.. మూడు రోజుల పాటు చంద్రబాబు ఈ విషయంపైనే ఉండనున్నారు. ప్రస్తుతం ఏపీలో అభ్యర్థుల ఎంపికలు ఊపందుకున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే కార్యక్రమాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తోంది.
మొత్తంగా 69 స్థానాలకు వైసీపీ సమన్వయ కర్తలను నిలబెట్టింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ వారి వారి ప్లేసెస్‌లో కుదురుకుంటున్నారు. మరోవైపు.. మరిన్ని స్థానాలకు కూడా వైసీపీ కసరత్తు ముమ్మరం చేసి.. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమిలో కూడా.. అభ్యర్థుల ఎంపికపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రచారం కూడా ప్రారంభించేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు.
వాస్తవానికి మంగళవారం షెడ్యూల్ ప్రకారం.. చంద్రబాబు రా.. కదలిరా! సభలకు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో సభలు నిర్వహించాలని భావించిన ఆయన.. ఇప్పటికి 17 నియోజకవ ర్గాల్లో పూర్తి చేశారు. ఈ నెల ఆఖరుకే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. అయోధ్య రామమందిర పర్యటన సహా.. ఇతరత్రా సమస్యలతో కొన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అభ్యర్థుల కసరత్తు కోసం.. మరోసారి రా..కదలిరా! సభలను వాయిదా వేసుకోవడం గమనార్హం.
దాదాపు మూడు రోజుల పాటు.. హైదరాబాద్‌లోనే ఉండనున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. జనసేన కీలక నేతలతో కలిసి ఆయన ఒక నిర్ణయానికి రానున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయి.. తుది రూపు తీసుకువచ్చి.. వచ్చే 4-5 తారీకుల్లో తొలి జాబితాను వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రా..కదలిరా! సభలను అప్పటి వరకు వాయిదా వేశారు.