ఏపీ అధికార పార్టీ వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారు. పైగా ఈయన ఎస్సీ నాయకుడు కావడం గమనార్హం. ఆయనే ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే, ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం. తాజాగా ఈయన హైదరాబాద్‌లో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. పార్టీలో చేరికపై ఆయన చర్చించారు. ఆదిమూలం వెంట ఆయన కుమారుడు కూడా ఉన్నారు. టీడీపీలో చేరే అంశంపై లోకేశ్ తో ఆయన చర్చించారు.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్‌లో సంప్రదించిన ఆదిమూలం ఆయన సూచనల మేరకే నారా లోకేష్‌తో భేటీ అయినట్టు తెలిసింది. సీఎం జగన్ నియోజకవర్గాల మార్పు చేపడుతుండడం చాలా మంది సిట్టింగ్ లకు నచ్చడం లేదు. దాంతో అసంతృప్తికి గురైన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయనను ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం తిరుపతి ఎంపీ టికెట్ ప్రతిపాదించింది.
గెలిపించుకునే బాధ్యతను తాముతీసుకుంటామని.. పోటీ చేయాలని సీఎం జగన్ స్వయంగా చెప్పుకొచ్చా రు. అయితే.. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం.. డైలమాలో పడ్డారు. పైగా.. స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే తనకు సీటు రాలేదని ఆయన ఇటీవల బహిరంగ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. వ్యక్తిగత విమర్శలు కూడా రువ్వారు. పెద్ది రెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
టీడీపీలో చేరేందుకు రెడీ అయిన ఆదిమూలంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీగా నే ఉంది. నియోజకవర్గంలో టీడీపీనాయకులు పెట్టుకున్న ఆశలు.. వారి హవా నేపథ్యంలో చంద్రబాబు ఈయనకు టికెట్ ఇవ్వడం .. గగనమేనని అంటున్నారు. అయితే.. టికెట్ ఇస్తారన్న ఆశలతోనే ఆదిమూలం ఇటువైపు అడుగులు వేశారు. మరి చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates