వచ్చే ఎన్నికలకు సంబంధించి సాధారణ నాయకులే టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇటు వైసీపీ, అటు టీడీపీల్లోనూ సిట్టింగులు.. ఇతర నేతలు పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో మాత్రమే ఎన్నికలకు వెళ్తే మజా ఏముంటుందని అనుకుంటున్న వైసీపీ. సినీ తారల వ్యవహారాన్ని కూడా తెరమీదికి తెచ్చింది. సినీ రంగానికి చెందిన ఒకరిద్దరు ప్రముఖులకు ఈ దఫా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికి 60 అసెంబ్లీ స్థానాలకు, 10 పార్లమెంటు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన వైసీపీ.. మిగిలిన స్థానాల్లో ఒకటి రెండు చోట్ల సినీ తీరాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులును రంగంలోకి దింపాలని అనుకున్నా.. ఆయన రానని చెప్పడం.. పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానం నుంచి మంచు విష్ణు వర్ధన్‌ను నిలబెట్టాలని పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే మంచు విష్ణుకు దూతల ద్వారా రాయబారం పంపించారని సమాచారం. జగన్ కుటుంబానికి మంచు కుటుంబంతో బంధుత్వం ఉండడం, ఈ కుటుంబం వైసీపీకి సానుకూలంగా ఉన్న దరిమిలా.. విష్ణును గుంటూరు నుంచి బరిలో దింపడం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. దీనిపై విష్ణు తీసుకునే నిర్ణయం ఆధారంగా వైసీపీ అడుగులు వేయనుంది. ఇక, విష్ణు విషయాన్ని చూస్తే.. ఆయన కూడా రాజకీయాలంటే ఇంట్రస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో ఓకే చెప్పే చాన్స్ ఉంది.
ఇక, ఎమ్మెల్యే సీట్ల కోసం.. రచయిత పోసాని కృష్ణమురళి, అలీ ఎదురు చూస్తున్నారు అలీకి టికెట్ కన్ఫర్మే అని అనుకున్నా.. ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, పోసాని విషయం మాత్రం.. ప్రస్తుతానికి పక్కన పెట్టిందని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రహస్యంగా ఇటీవల ఆయన సీఎంజగన్‌తోనే భేటీ అయి.. తన మనసులో మాట బయట పెట్టారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తేలనుంది.సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ లో ఈ సారి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు సినీ తారలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.