టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రస్తుతం రా.. కదలిరా! సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రిలో పర్యటించిన ఆయన ఈ సభలో పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు కూడా తరలి వచ్చారు. స్టేజ్‌పై కూడా స్థానిక నాయకులకు అవకాశం కల్పించారు. ఇక, ప్రసంగం అయిపోయి.. చంద్రబాబు స్టేజీ దిగుతున్న సమయంలో ఆయనకు ఎదురుగా వచ్చి.. కొందరు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలపబోయారు. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు తడబడి..పడబోయారు. వెంటనే అప్రమత్తమైన.. ఆయన సిబ్బంది.. కింద పడకుండా.. చంద్రబాబును పట్టుకున్నారు.
ఒక వేళ చంద్రబాబు కనుక పడి ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.. దాదాపు నాలుగు అడుగుల ఎత్తులో చుట్టూ బారికేడ్లు కట్టి మరీ స్టేజీని నిర్మించారు. దానిపైని నుంచి ఆయన పడి ఉంటే.. తలకు పెద్ద గాయం అయి ఉండేది.. కాళ్లు చేతులకు కూడా దెబ్బలు తగిలి ఉండేది. కానీ, సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఇదీ..జరిగింది. అయితే.. చంద్రబాబుకు జరిగిన ప్రమాదం వెనుక రెండు కారణాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి.. సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు.. చంద్రబాబును అభినందించేందుకు లెక్కకు మిక్కిలిగా స్టేజీ ఎక్కడంతో అక్కడ కిక్కిరిసిపోయి.. చంద్రబాబును తోసేశారని కొందరు చెబుతున్నారు.
కానీ, ప్రత్యక్ష సాక్షుల కథనం డిఫరెంట్‌గా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం అసెంబ్లీ సీటును తమకు ఇస్తామని చెప్పి.. ఇవ్వకుండా.. జనసేనకు ఇచ్చేశారని స్థానిక టీడీపీ నాయకులు.. బొడ్డువెంకటరమణ.. తన వర్గీయులతో సభ ముందు ఆందోళన చేశారు. అనంతరం.. చంద్రబాబును కలిసి ఈ విషయంపై తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో నేరుగా స్టేజీపైకి ఎక్కి.. నినాదాలు చేయడం.. గందరగోళం సృష్టించడంతో బొడ్డు వర్గీయులు తోపులాటకు దిగారని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అదుపు తప్పి పడబోయారని, అయితే.. సిబ్బంది చంద్రబాబును పట్టుకుని.. కిందపడకుండా చూశారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది టీడీపీ ఏం చెబుతుంది? ప్రభుత్వం ఏం చెబుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates