చింత‌మ‌నేని Vs అబ్బ‌య్య చౌద‌రి … 4 నెల‌ల ముందే బెట్టింగుల ర‌చ్చ!

దెందులూరు రాజ‌కీయం ఈ సారి మ‌రింత ర‌చ్చ‌గా మారింది. పూర్తిగా వ‌న్‌సైడ్ అయ్యేలా ఉంది. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కంచుకోట‌లా ఉన్న దెందులూరులో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వేవ్‌లో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి 17 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ప్ర‌భాక‌ర్ హ్యాట్రిక్ కొట్టేస్తార‌న్న అంచ‌నాలు ఉన్నా.. చివ‌ర్లో జ‌గ‌న్ వేవ్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు అనూహ్యంగా మార‌డం.. తెలుగుదేశం నుంచి కీల‌క‌నేత‌లు వైసీపీలోకి వెళ్ల‌డంతో ప్ర‌భాక‌ర్ ఓట‌మిపాల‌య్యారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ మొద‌లైపోయింది. దెందులూరులో రాజ‌కీయ వాతావ‌ర‌ణం బాగా వేడెక్కింది. అటు అబ్బ‌య్య‌, ఇటు చింత‌మ‌నేని ఇద్ద‌రూ హోరాహోరీగా ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు. చింత‌మ‌నేనిపై గ‌త ఎన్నిక‌ల్లో దూకుడుపై, ప్ర‌జ‌ల‌ను తిడ‌తారంటూ ప్ర‌చారం చేసిన వైసీపీ అబ్బ‌య్య చౌద‌రికి ఇప్పుడు అదే మైన‌స్ అవుతోంది. అబ్బ‌య్య చౌద‌రి దూకుడు రాజ‌కీయం చేయ‌క‌పోయినా ఆయ‌న పేరు చెప్పుకుని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం దెందులూరులో ఇష్ట‌మొచ్చిన‌ట్టు అరాచ‌కాలు చేసింద‌నే చెప్పాలి.

నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు న‌డుస్తూనే ఉన్నాయి. ప‌దేళ్ల ప్ర‌భాక‌ర్ అభివృద్ధితో పోల్చుకుంటే ఈ ఐదేళ్ల‌లో పెద్ద‌గా అభివృద్ధి లేదు. ఈ సారి ఎన్నిక‌ల్లో గెలుపు ప్ర‌భాక‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు కీల‌కం కావ‌డంతో బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. తాను చేసిన అభివృద్ధిని, అబ్బ‌య్య చౌద‌రి చేసిన అభివృద్ధిని పోల్చి చూసుకుని త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఓట‌ర్ల‌ను అడుగుతున్నారు. అటు అబ్బ‌య్య చౌద‌రి కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు అన్ని పార్టీల వాళ్ల‌కు ప‌నులు చేశాన‌ని… మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఎన్నిక‌ల‌కు 70 రోజుల ముందు నియోజ‌క‌వ‌ర్గంలో బెట్టింగులు మాత్రం జోరుగా న‌డుస్తున్నాయి. ఆరు నెల‌ల ముందు వ‌ర‌కు ప్ర‌భాక‌ర్ ఓడిపోతాడ‌ని వైసీపీ వాళ్లు గ‌ట్టిగా బెట్టింగులు వేశారు. ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది ఈ బెట్టింగుల్లో వైసీపీ వాళ్లు వెన‌క్కు త‌గ్గుతుంటే టీడీపీ వాళ్లు, ప్ర‌భాక‌ర్ అభిమానుల జోరు మామూలుగా లేదు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో అన్ని మండ‌లాల్లోనూ ప్ర‌భాక‌ర్ గెలుపుపై భారీగా బెట్టింగులు న‌డుస్తున్నాయి. ఆరు నెల‌ల ముందు అబ్బ‌య్య చౌద‌రిపై బెట్టింగుల జోరు ముందు టీడీపీ వాళ్లు వెన‌క‌డుగు వేయ‌గా.. ఇప్పుడు వైసీపీ వాళ్లు బేజార‌వుతున్నారు.

ప్ర‌భాక‌ర్ గెలుపుపై ఇప్పుడు ఐదెచ్చు.. ఆరెచ్చు పందాలు భారీగా న‌డుస్తున్నాయి. ఐదెచ్చు.. ఆరు ఎచ్చు పందెం ఇప్పుడు కోట్ల‌లో న‌డుస్తోంది. మండ‌లాల వారీగా కూడా ఎవ‌రికి ఎంత మెజార్టీ వ‌స్తుంద‌న్న దానిపై లెక్కలు వేసుకుని మ‌రీ పందాలు కాస్తున్నారు. అబ్బ‌య్య‌, ప్ర‌భాక‌ర్‌కు సొంత మండ‌లం అయిన పెదవేగి, దెందులూరులో టీడీపీకి భారీ మెజార్టీ వ‌స్తుందంటున్నారు. ఏలూరు రూర‌ల్‌, పెద‌పాడులో ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని కొంద‌రు.. ఈ రెండు చోట్ల వైసీపీకి స్వ‌ల్ప లీడ్ ఉంటుంద‌ని వైసీపీ వాళ్లు ఇలా ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు.