ప్రకాశం జిల్లాలోని రెండు సీట్ల విషయంలో ఇంకొంతకాలం సస్పెన్స్ తప్పేట్లు లేదు. ఇంతకీ ఆ సీట్లు ఏమిటంటే ఒంగోలు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు సీట్లే. అసెంబ్లీకి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. అయితే సమస్యంతా పార్లమెంటు సీటుమీదే నడుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇదే విషయాన్ని మాగుంటకు కూడా చెప్పేశారట. తన కొడుకు రాఘవరెడ్డికి అయినా టికెట్ ఇవ్వమంటే కుదరదని జగన్ చెప్పినట్లు ప్రచారంలో ఉంది.
అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందే అని బాలినేని పట్టుబట్టారు. తండ్రికి కాకపోతే కనీసం కొడుకు రాఘవకు అయినా ఇవ్వాలని ఎంఎల్ఏ గట్టిగా చెబుతున్నారు. ఈ ఇద్దరికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే తాను అసెంబ్లీకి పోటీచేసేది లేదని బాలినేని చెప్పేశారనే ప్రచారం బాగా జరుగుతోంది. మాగుంట వ్యవహారంకు ముందునుండే బాలినేని పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. చీటికిమాటికి అలగటం, పార్టీకి దూరంగా ఉండటం, జగన్ పిలపించుకుని బతిమలాడటం రెగ్యులర్ అయిపోయింది.
కొంతకాలంగా బాలినేని వ్యవహారంతో విసిగిపోయిన జగన్ ఇపుడు మాజీమంత్రిని అంతగా పట్టించుకోవటంలేదు. కాకపోతే సమస్య ఏమిటంటే బాలినేని, మాగుంటకు జిల్లాలో పట్టుండటమే. దగ్గరి బంధువు అవటం ఒక కారణమైంతే నియోజకవర్గంలో పట్టున్న కారణంగానే బాలినేనిని జగన్ భరిస్తున్నారని అనుకోవాలి. దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం జగన్ దెబ్బేంటో రుచిచూడక తప్పదని బాలినేని మరచిపోయినట్లున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే ఒంగోలు పార్లమెంటు టికెట్ మాగుంటకు కాకపోతే ఇంకెవరికి ? అన్నదే జగన్ తేల్చుకోలేకపోతున్నట్లున్నారు.
ఒకసారి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు మరోసారి వైవీసుబ్బారెడ్డి పేరు నలుగుతోంది. అయితే వీరిలో ఎవరు పోటీలో ఉన్నా బాలినేని కంపుచేయటం ఖాయం. పార్టీలో చాలామంది అసలు బాలినేనినే పార్టీనుండి బయటకు పంపేయమని చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలినేనిని పార్టీనుండి బయటకు పంపేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతున్న వాళ్లు కూడా ఉన్నారట. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates