సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్ తో పాటు తనకు కూడా సమానంగా భాగస్వామ్యం ఉందని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్ కు, తనకు సమాన వాటా ఉండాలని అనుకున్నారని చెప్పారు.
ఇక వైఎస్ఆర్ కుటుంబం సొంత ఇలాక కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని విమర్శించారు. రక్తం పంచుకు పుట్టిన తనపై రోజుకో దొంగతో జగన్ తిట్టిస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నీచ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా భయపడబోనని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కడప తనకు పుట్టినిల్లు అని, జగన్ లా తాను కూడా జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ శ్రేణులకు గుర్తు లేవని షర్మిల విమర్శించారు. తనపై బురదజల్లేందుకు రోజుకో జోకర్ ను తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలా రెడ్డి అన్నదే తన ఉనికి అని చెప్పారు. విలువలు విశ్వసనీయతలు మీకు లేవా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates