టీడీపీ పార్లమెంటు సభ్యుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన పార్టీ కేడర్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాలు, వ్యాపారం రెండూ తాను కొనసాగించలేక పోతున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేనని చెప్పారు.
దీంతో తన వ్యాపారాలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి వస్తోందని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు వస్తున్నాయని, వచ్చాయని ఆయన చెప్పారు. పైగా వ్యాపారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నట్టు గల్లా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తన రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “గుంటూరు ప్రజలు నన్ను ఆదరించారు. ఇక్కడ నుంచి మరోసారి కూడా గెలిపించేందుకు వారు సిద్దంగానే ఉన్నారు. కానీ, నేను రాజకీయాల్లో ఉంటే.. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే తప్పుకొంటున్నా” అని గల్లా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాజకీయాల పై అసంతృప్తి వ్యక్తం చేసిన గల్లా.. ప్రభుత్వంపై పోరాడితే.. వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ రాజధాని అమరావతి విషయంలో తెగువ ప్రదర్శించినట్టు చెప్పారు. ఇటు రైతులకు మద్దతుగా ఉంటూనే అటు పార్లమెంటులోనూ నిలదీశానని, తర్వాత.. ఇది తన వ్యాపారాలపై ఎఫెక్ట్ చూపించిందని అన్నారు. పార్లమెంట్ లో 24% వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా కూడా.. మౌనంగా ఉంటారని.. కానీ, తాను మాత్రం మౌనంగా ఉండలేనని గల్లా వ్యాఖ్యానించారు.
నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదన్నారు. “2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాను. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను.” అని గల్లా అన్నారు.
బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ.. రాజకీయాలు అలా చేయలేమని, ఫుల్‌టైమ్ దానికి ఇవ్వాల్సిందే నని గల్లా అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తాను ఫుల్ టైం దానికి కేటాయించలేనన్నారు. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పారు.