రేవంత్ కు ఫస్ట్ వీక్ చాలా కీలకమా ?

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే మొదటివారంలోనే రెండు హామీలను అమలుచేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రెండు హామీల అమలుపై రేవంత్ ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోను హింట్ ఇచ్చినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. పథకాల లబ్దిదారుల్లో అర్హుల ఎంపికకోసం ఇప్పటికే అధికారులు గడచిన నెలరోజులుగా పెద్దఎత్తున కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

అధికారంలోకి రాగానే నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలుచేస్తామని సిక్స్ గ్యారెంటీస్ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తదితరులు పదేపదే ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఫిబ్రవరి మొదటివారంలో 200 యూనిట్లు ఉపయోగించే వినియోగదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం, రు.500కే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారట. రేవంత్ ఆదేశాలతో ఉచిత గ్యాస్ సిలిండర్లపైన సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, ఉచిత విద్యుత్ పై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు.

పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. తెల్ల రేషన్ కార్డులంటేనే  నిరుపేదలని అర్ధం. కాబట్టి పై రెండు ఉచిత పథకాల అమలుకు 90 లక్షల రేషన్ కార్డులనే ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే తెల్లరేషన్ కార్డులున్న వాళ్లంతా పేదలే అని  అనుకునేందుకు లేదు. అందుకనే ఆధార్ కార్డుల ఆధారంగా వైట్ రేషన్ కార్డుదారులపై కసరత్తులు చేస్తోంది.

ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. అంటే రెండు హామీలను అమలు చేస్తోంది. మరో రెండు హామీల అమలుకు కసర్తతులు చేస్తోంది. అర్హులైన  మహిళకు నెలకు రు. 2500 పెన్షన్ పథకం అమలుపైన అధికారులు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. వందరోజుల్లోపు సిక్స్ గ్యారెంటీస్ అమల్లో తేవాలన్నది రేవంత్ పట్టుదలగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ పూర్తిచేసి పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలన్నది రేవంత్ ఆలోచనట. మరి ఏమవుతుందో చూడాలి.